సాహో రేంజ్ లో టైగర్ ఖర్చు

కమర్షియల్ సినిమా ఏదైనా హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. ప్రతినాయకుడు ఏ మాత్రం బలహీనంగా ఉన్నా అది మాస్ కి కనెక్ట్ కాకపోగా చివరికి నవ్వులపావుతుంది. జగదేకవీరుడు అతిలోకసుందరితో మొదలుపెట్టి కెజిఎఫ్ దాకా చూసుకుంటే లీడ్ క్యారెక్టర్ అంతగా హై లైట్ అవ్వడంలో విలన్ల ప్రభావం చిన్నది కాదు. అందుకే మాస్ డైరెక్టర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి తోడు ఎవరైనా ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కనక నెగటివ్ షేడ్స్ చేస్తుంటే సెటప్ కూడా గ్రాండ్ గా ఉండాలి. దాన్ని ప్రొజెక్ట్ చేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. దానికి ఉదాహరణగా నిలుస్తోంది టైగర్ 3.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాను యష్ రాజ్ సంస్థ 350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇందులో విలన్ గా ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఐఎస్ఐ ఏజెంట్ గా చాలా షాకింగ్ షేడ్స్ తో ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగా తెలిసింది. ఇతని ఎంట్రీ కోసమే సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్రో ఎపిసోడ్ షూట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయిలో పండిందో. మరి విలన్ కే ఇంత బిల్డప్ ఇస్తున్నప్పుడు అసలు హీరో సల్మాన్ పరిచయ సన్నివేశం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే

టైగర్ 3కి యష్ బ్యానర్ ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఉంది. ఇది ఆ సంస్థకు 50వ సినిమా. అందుకే బాలీవుడ్ లో ఇప్పటిదాకా రాని గ్రాండియర్ తో విజువల్స్ తో దీన్ని తీయాలని ముందే డిసైడ్ అయ్యారు. టైగర్, టైగర్ జిందా హై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ని కాకుండా మనీష్ శర్మను తీసుకోవడం గురించి గతంలో ఏవేవో కథనాలు వచ్చాయి కానీ అవేవి నిజం కాదట. జాఫర్ మిస్టర్ ఇండియాతో సహా ఇతర కీలక ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో అప్పటిదాకా ఆగలేక మనీష్ ని లాక్ చేసినట్టు తెలిసింది. టైగర్ 3 వచ్చే ఏడాది విడుదలవుతుందా లేదా అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఆశిస్తున్నారు

Also Read: ఇటు సినిమా ఫ్లాపు అటు పోలీస్ కేసు

Show comments