iDreamPost
iDreamPost
భారీ అంచనాలు ఖర్చుతో జరుగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు క్విజ్ షో క్లైమాక్స్ కు వచ్చేసింది. నిన్న సాయంత్రంతో తన చివరి ఎపిసోడ్ షూట్ ని జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసినట్టు టీవీ వర్గాల సమాచారం. అధికారికంగా ఇంకా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ టాక్ అయితే నిజమనేలా వినిపిస్తోంది. జెమినీ ఛానల్ ఆశించినట్టు ఈ షోకు కనివిని ఎరుగని రేటింగ్స్ రాలేదు కానీ బిగ్ బాస్ 5 కంటే మెరుగ్గా రావడం ఊరట కలిగించే అంశం. రామ్ చరణ్, సమంతా, రాజమౌళి-కొరటాల శివ ఎపిసోడ్లు మంచి స్పందన దక్కించుకున్నాయి. త్వరలో తమన్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో రాబోయే భాగం కోసం ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇది త్వరలోనే రానుంది.
ఇదంతా బాగానే ఉంది అసలైన మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారని ఈ షో ఫ్యాన్స్ తో పాటు సూపర్ స్టార్ అభిమానులు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే దాంతోనే ఎవరు మీలో కోటీశ్వరులుకి ముగింపు పలుకుతారట. తర్వాత రెండో సీజన్ ని కొనసాగించడం అనుమానమేనని టాక్. ఆర్ఆర్ఆర్ ఫినిష్ చేసిన తారక్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం కొత్త మేకోవర్ ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ లుక్ ని బయటి కార్యక్రమాలు యాడ్స్ లో పాల్గొనడం ద్వారా రివీల్ చేసే ఉద్దేశంలో లేరట. అందుకే కొనసాగింపు గురించి ఎలాంటి సమాచారం లేదు.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ తో పాటు ఇప్పుడీ ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ లో కీలక భాగం పోషించిన యంగ్ టైగర్ ఇకపై కూడా ఇలాంటి ప్రోగ్రాంస్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు తమన్నాతో మాస్టర్ చెఫ్ ని ప్రారంభించిన జెమినికి ఈ విషయంలో మాత్రం చేదు అనుభవం ఎదురయ్యింది. కాల్ షీట్లు లేకనో మరో కారణమో తెలియదు కానీ ఇప్పుడు మిల్కీ బ్యూటీ స్థానంలో యాంకర్ అనసూయ రావడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోలు ఇలా పలురకాల మార్గాలు తారలకు ఆదాయ మార్గాలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఆప్షన్లు రాబోతున్నాయో చూడాలి మరి
Also Read : Sankranthi Releases : సంక్రాంతికి వచ్చేదెవరు తగ్గేదెవరు