మున్సిపల్ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల సమయం ఉన్న ఈ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు నిలిపివేయాలంటూ సోమవారం రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సోమవారం ప్రచారం ముగింపు సమయానికి ఎన్నికలు పూర్తిగా వాయిదా పడినట్లు తెలిసింది. దింతో అభ్యర్థులు గోళ్లుమంటున్నారు.
ఓటర్ల లిస్టు లో తేడాలు
2019లో ఏలూరు నగరపాలక సంస్థ లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. సత్రంపాడు, శనివారపుపేట, తంగేళ్లమూడి, కొమడవోలు, వెంకటాపురం, చోదిమెల్ల, పొనంగి లను ఏలూరులో కలిపే అంశం మీద వివాదం చెలరేగింది. ఏలూరు కార్పొరేషన్లో విలీనం అనైతిక చర్యగా కొందరు హైకోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసు నడుస్తున్న సమయంలోనే ఎన్నికలు వచ్చాయి. దీంతో మొత్తం ఏడు పంచాయితీలను కలుపుకొని ఓటర్ లిస్టు తయారు చేశారు. అయితే ఓటర్ లిస్టు శాస్త్రీయంగా తయారు చేయలేదు అన్న దానిపై మరో కేసు హైకోర్టు లో ఫైల్ అయ్యింది. ఏడు పంచాయతీలు కలుపుకుని మొత్తం ఓటర్లను కేవలం ఓటర్ల లిస్టు ఆధారంగా సగటున డివిజన్ కు 5000 మంది చొప్పున 50 డివిజన్లకు విభజించరని, దీనివల్ల ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తల ఓట్లు వేరువేరు డివిజన్లకు వెళ్లాయని పిటిషనర్ వాదించారు. దీనితో ఏకీభవించిన కోర్టు ఓటర్ల లిస్టు లో ఉన్న తేడాలను గమనించి నగరపాలక సంస్థ ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
లబోదిబోమంటున్న అభ్య ర్థులు
ప్రస్తుతం ఏలూరు నగరపాలక సంస్థ 3 డివిజన్లు అధికారపార్టీకి ఏకగ్రీవమయ్యాయి. 47 డివిజన్ లో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. సరిగ్గా ప్రచారం అయిపోతున్న వేళ ఎన్నికలు ఆగిపోయినట్లు సమాచారం రావడంతో అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఇప్పటివరకు ప్రచారానికి పెట్టిన ఖర్చు అంతా మట్టి పాలు అయ్యిందని వాపోతున్నారు. కనీసం కోర్టు ఎన్నిక ప్రక్రియ మొదలయ్యే సమయంలో తీర్పు వెలువరించిన తమకు చాలా ఖర్చు కలిసి వచ్చేదని, చివరి నిమిషంలో ఎన్నిక రద్దు అవడంతో చాలా నష్టపోయామని పోటీలు అభ్యర్థులు వాపోతున్నారు. అయితే దీనిపై రిట్ పిటిషన్ వేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సాధ్యాసాధ్యాలను న్యాయనిపుణులతో మాట్లాడుతున్నారు. ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని దీని మీద కొందరు అడ్వకేట్ లతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఎన్నిక మీద ఎలా ముందుకెళ్లాలనే దానిమీద ఆయన మంతనాలు జరిపారు.