Idream media
Idream media
గత కొంత కాలంగా వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, న్యూస్ ఛానెళ్లు కథనాలు వండి వారుస్తున్నాయి. ఈ తరహాలోనే ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర అప్పులపై ఓ బ్యానర్ కథనం ప్రచురించింది. రుణ పరిమితికి మించి ప్రభుత్వాలు అప్పులు చేశాయంటూ ఈనాడు గణాంకాలను పొందుపరిచింది. ఆయా గణాంకాలను విశ్లేషించింది. 2015–16 ఆర్థిక ఏడాది నుంచి 2021–22 ఆర్థిక ఏడాది వరకు ఏపీ తన రుణపరిమితికి మించి 51,930.83 కోట్ల రూపాయల రుణం సేకరించిందని తెలిపింది. అందులో 2015–16 నుంచి 2018–19 మధ్య 18,455.27 కోట్ల రూపాయల అప్పు చేయగా.. 2019–20 నుంచి 2021–22 మధ్య 33,475.56 కోట్ల రూపాయల అప్పు చేశారని పేర్కొంది.
బురదజల్లబోయి వాస్తవాలు చెప్పిన ఈనాడు..
ప్రస్తుత ఆర్థిక ఏడాది మరో రెండురోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో చివరగా 943 కోట్ల రూపాయలను రుణం సేకరించేందుకు జగన్ ప్రభుత్వం ఆర్‌బీఐకి ప్రతిపాదనలు పంపిందని ఈనాడు చెప్పింది. ఈ కథ చెప్పేందుకు రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది మినహా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పరిమితికి మించి చేసిన అప్పుల లెక్కలను చెప్పుకొచ్చింది. జగన్ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని ఈనాడు కథనం రాసినా.. అంతిమంగా అది జగన్ ప్రభుత్వానికి మేలే చేసింది. అప్పులపై అసలు నిజాలను తన పాఠకులకు ఈనాడు తెలియజేసింది.
అంతా బాగున్నప్పుడు బాబు.. కరోనా సమయంలో జగన్..
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ప్రత్యేకహోదాకు బదులుగా చంద్రబాబు ఒప్పుకున్న ప్రత్యేక ప్యాకేజీతో కేంద్రం నుంచి వచ్చిన నిధులు, కరోనా వంటి సంక్షోభాలు లేకుండా సాఫీగా సాగిన కాలంలోనూ చంద్రబాబు ప్రభుత్వం రుణ పరిమితికి మించి అప్పులు చేసినట్లు ఈనాడు స్పష్టం చేసింది. 2015–16 నుంచి 2018–19 మధ్య నాలుగు ఆర్థిక ఏడాదుల్లో చంద్రబాబు సర్కార్ 18,455.27 కోట్ల రూపాయల అప్పు చేసిందని ఈనాడు పేర్కొంది. అదే సమయంలో వైసీపీ సర్కార్ 2019–20 నుంచి 2021–22 మధ్య మూడు ఆర్థిక ఏడాదుల్లో 33,475.56 కోట్ల రూపాయల అప్పు చేసిందని పేర్కొంది.
ఈ గణాంకాలు చెప్పిన ఈనాడు.. అసలు విషయం మాత్రం చెప్పలేదు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు చెబితే జగన్ సర్కార్‌పై బురద జల్లాలనే ఈనాడు లక్ష్యం పక్కదారి పడుతుంది. అందుకే 2019–20 ఆర్థిక ఏడాది చివరలో మొదలైన కరోనా సంక్షోభం, 2020 మార్చి నుంచి పెట్టిన లాక్‌డౌన్లు, స్తంభించిన ప్రజా జీవితం,వరుసగా రెండున్నరేళ్లపాటు ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్థమైన తీరు,పరిశ్రమల మూత, చిన్నా,పెద్దా సంస్థల షట్‌డౌన్లు, ఉపాధి, ఉద్యోగాల కోత.. ప్రభుత్వాలకు తగ్గిన రాబడి.. వంటి పరిస్థితులను ఈనాడు తన కథనంలో పేర్కొనకపోయినా.. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమై,ఆ కష్ట,నష్టాలనుంచి బయటపడేందుకు యత్నిస్తున్న ప్రజలకు సులువుగానే అర్థమవుతుంది.
ఇలాంటి పరిస్థితి ఉన్నా.. పాలన సాగిస్తూ, ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులకు పొరుగు రాష్ట్రాల్లో మాదిరిగా జీతభత్యాలలో కోత పెట్టకుండా, అదే సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసిన సీఎం జగన్ ప్రజల ఖాతాల్లో దాదాపు 1.30 లక్షల కోట్ల రూపాయలు నేరుగా జమ చేశారు. కరోనా వల్ల ఇతర రాష్ట్రాల ప్రజలు రోజువారీ జీవనానికి ఇబ్బందిపడగా..జగన్ సర్కార్ అమలుచేసిన నగదు బదిలీ పథకాల వల్ల ఏపీ ప్రజలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనలేదు. అంతేకాకుండా కరోనాను జగన్ సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కొని దాని తీవ్రతను తగ్గించింది.
కానీ టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి విపత్కర పరిణామం లేకపోయినా.. సంపదను సృష్టించాను, ఆదాయాన్ని పెంచాను అని చెప్పుకునే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర రుణపరిమితికి మించి అప్పులు చేశారు. చేసిన అప్పులతో పోలవరం కట్టారా..? అమరావతి నిర్మించారా..? లేదా జగన్ సర్కార్ అమలు చేసినట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసే సంక్షేమ పథకాలు అమలు చేశారా..? అంటే టీడీపీ నేతలు నీళ్లు నమలాల్సిన పరిస్థితి. కరోనా సంక్షోభంలో జగన్ సర్కార్ రుణ పరిమితికి మించి అప్పులు చేయగా.. అలాంటి పరిస్థితి లేని సమయంలోనూ చంద్రబాబు సర్కార్ రుణపరిమితికి మించి అప్పులు చేసిందనే విషయం ఈనాడు చెప్పకపోయినా.. ఆ కథనంలో పేర్కొన్న గణాంకాల ద్వారా స్పష్టమైంది.