iDreamPost
android-app
ios-app

బొంకడంలో సంకోచం లేదు

బొంకడంలో సంకోచం లేదు

తెలుగు జర్నలిజంలో ఈనాడుది ప్రత్యేకమైన ప్రస్థానం. ఈనాడు రాక ముందు విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రభూమి వంటి పత్రికలు ఉన్నా.. ఈనాడు సెట్‌ చేసిన విధానాన్నే అన్ని పత్రికలు పాటించాయి. ఈనాడు రాసే రాజకీయపరమైన కథనాలు ఎలా ఉన్నా.. న్యూస్‌ను నిజాయతీగా ప్రచురిస్తుందనే భావన తటస్థ పాఠకుల్లో ఉంది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఈనాడు తీరు క్రమంగా మారుతోంది. తనకు నచ్చిన ప్రభుత్వం లేదని, ఇకపై రాబోదనే భావనలో ఈనాడు యాజమాన్యం ఉన్నట్లుగా ఆ పత్రికల్లో వస్తున్న వార్తల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

దివంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలపై.. వాస్తవవిరుద్ధమైన కథనాలను రాసిన ఈనాడు.. తాజాగా సమాచారాన్ని కూడా వక్రీకరిస్తూ అసత్యాలను తన పాఠకులకు చేరవేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల విషయాన్ని రాసిన వార్త ద్వారా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం బీసీ ఉప కులాల ప్రజల సమానాభివృద్ధికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. గతంలో ఒక బీసీ కార్పొరేషన్‌ దాని పరిధిలో 13 బీసీ ఉపకులా ఫెడరేషన్లు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్‌కు మాత్రమే పాలక మండలి ఉండేది.

అయితే ఈనాడు మాత్రం ఈ రోజు రాసిన వార్తలో.. గతంలో 26 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం మరో 30 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇచ్చిందని రాసుకొచ్చింది. నిజంగా 26 కార్పొరేషన్లు ఉంటే.. వాటికి చైర్మన్, డైరెక్టర్లు ఉండేవారు కదా.. అనే సందేహం ప్రజలకు వస్తుందన్న ఆలోచన కూడా లేకుండా ఈనాడు నిస్సంకోచంగా అవాస్తవాలను పాఠకుల మెదళ్లలో ఎక్కించే ప్రయత్నం చేస్తోంది.

మొన్న సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణపై సీఎం వైఎస్‌ జగన్‌ సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారన్న విషయాన్ని తన పాఠకులకు అందించకపోవడంతోనే ఈనాడు వైఖరిపై తటస్థ పాఠకులు ఒక అంచనాకు వచ్చారు. తాజాగా ఈ రోజు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటులో వాస్తవాన్ని వక్రీకరిస్తూ వార్త ప్రచురించడంతో రాబోవు రోజుల్లో ఈనాడు పత్రిక ఎలా వ్యవహరిస్తుందన్న అంచనాకు పాఠకులు వస్తున్నారు.