iDreamPost
android-app
ios-app

పిసినారి మొగుడు గడసరి కొడుకు – Nostalgia

  • Published Jun 24, 2021 | 11:14 AM Updated Updated Jun 24, 2021 | 11:14 AM
పిసినారి మొగుడు గడసరి కొడుకు – Nostalgia

ప్రాక్టికల్ గా బయట ఎవరైనా పిసినారి కనిపిస్తే తిట్టుకుంటాం కానీ సినిమా వరకు మాత్రం ఇదో అద్భుతమైన కామెడీ కాన్సెప్ట్. జంధ్యాల గారు కేవలం ఈ ఒక్క పాయింట్ ఆధారంగా తీసుకుని చేసిన ‘అహ నా పెళ్ళంట’ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. అతి పొదుపు చేయాలనే తపనతో సదరు పాత్రలు చేసే హాస్యం మనసారా చక్కిలి గింతలు పెడతాయి. అలాంటి మరో ఆణిముత్యం లాంటి హాస్య గుళిక ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’. హాయిగా నవ్వించే సినిమాలు తీస్తారని పేరున్న రేలంగి నరసింహరావు దీనికి దర్శకులు కాగా పెళ్లి పుస్తకం జంట రాజేంద్ర ప్రసాద్ – దివ్యవాణి జంటగా నటించారు. ఎప్పుడు చూసినా విసుగురాని ఎంటర్ టైనర్ ఇది.

వాస్తవానికి ఈ టైటిల్ ప్రకటించినప్పుడు కొంత వివాదం చెలరేగింది. ఏదో ద్వందార్థం సూచించేలా పేరు పెట్టారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సినిమా చూశాక అప్పుడూ ఇదే అనిపిస్తే మారుస్తామని హీరో డైరెక్టర్ ఇద్దరు మాటివ్వడంతో అది చల్లారింది. కానీ రిలీజయ్యాక ఇంత కన్నా బెస్ట్ టైటిల్ దీనికి సూట్ కాదని ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో ఏకీభవించడంతో సినిమా ఘన విజయం అందుకుంది. పైసా ఖర్చుపెట్టేందుకు వందసార్లు ఆలోచించే వరప్రసాద్, ఖర్చైనా పర్లేదు జీవితాన్ని ఆస్వాదించాలనే మనస్తత్వం ఉన్న జయలక్ష్మిలు పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతకాలానికే విడిపోతారు.

కట్ చేస్తే కొన్నేళ్ళయ్యాక ఎదురుబిదురు ఇళ్లలో వేర్వేరు కాపురాలు పెడతాడు. విడిపోయేనాటికి జయలక్ష్మి గర్భవతి. చిచ్చరపిడుగు శ్రీధర్(బాలాదిత్య)పుట్టాడని ప్రసాద్ కు తెలిసి ఉండదు. వీడు నాన్నను మించిన పీనాసిగొట్టు. అక్కడి నుంచి మొదలువుతుంది అసలు కామెడీ. కాశి విశ్వనాధ్-శంకరమంచి పార్ధసారథి మాటలు బ్రహ్మాండంగా పేలాయి. హాస్య చిత్రమే అయినా జెవి రాఘవులు అందించిన పాటలు చక్కగా అమరాయి. శ్రీలక్ష్మి-రాళ్లపల్లి-మల్లికార్జునరావులు పండించిన కామెడీ సూపర్ గా వర్కౌట్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలాదిత్య అలా గుర్తుండిపోయాడు. 1991 ఆగస్ట్ 20 ఈ సినిమా ‘మామగారు’తో పాటు ఒకేరోజు విడుదలయ్యింది. రెండూ సూపర్ హిట్ కావడం గమనార్హం.