iDreamPost
iDreamPost
సౌత్ లో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించి అపూర్వ విజయం సాధించిన దృశ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం దీనికే చెల్లింది. కమర్షియల్ అంశాలు లేకుండా టీనేజ్ పిల్లల తండ్రిగా హీరోను చూపిస్తూ అన్ని వర్గాలను మెప్పించిన సినిమాగా అప్పట్లో ఇది సృష్టించిన సంచలనం మాములుది కాదు.
తర్వాత కన్నడలో రవి చంద్రన్, తమిళ్ లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ లాంటి స్టార్లు పోటీలు పడి మరీ రీమేక్ చేసుకుని అక్కడా సూపర్ హిట్లు అందుకున్నారు.తెలుగులో అదే పేరుతో వెంకటేష్ తో రీమేక్ చేస్తే మంచి విజయం సాధించింది. ఇది నేషనల్ లెవెల్ లో యాక్సెప్ట్ చేయబడిన సబ్జెక్టుగా అందరూ కొనియాడారు. అయితే దృశ్యం స్థాయి అక్కడితో ఆగలేదు. శ్రీలంకలో ధర్మయుద్ధ అనే పేరుతో రీమేక్ చేస్తే అక్కడా బాగా ఆడింది. ఇప్పుడు సీన్ చైనాకు మారాక రచ్చ ఇంకో లెవెల్ లో ఉంది.
ఇటీవలే దృశ్యం చైనాలో వూషా పేరుతో రీమేక్ అయ్యింది. శ్యామ్ క్వాహ్ అనే దర్శకుడు పెద్దగా మార్పులు చేయకుండా అక్కడి నేటివిటీకి తగ్గట్టు తీశాడు. హీరోగా గ్జియో యాంగ్ నటించాడు. ఇంగ్లీష్ లో Sheep Without a Shepherd పేరుతో అనువదించారు. గత డిసెంబర్ 13 గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా దీనికి వచ్చిన కలెక్షన్లు అక్షరాలా 168 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 1200 కోట్ల రూపాయలన్న మాట. ఇంకా అక్కడ స్ట్రాంగ్ రన్ కొనసాగుతోంది. ఫైనల్ గా ఎంత చూపిస్తుందనేది షాకింగ్ గా ఉంటుందని అక్కడి ట్రేడ్ మాట. ఫ్యామిలీ ఎమోషన్స్ కి క్రైమ్ ని మిక్స్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కిన దృశ్యం ఇలా వివిధ భాషల్లోనూ సత్తా చాటడం చూస్తుంటే అసలు సృష్టికర్త జీతూ జోసెఫ్ కు థాంక్స్ చెప్పాల్సిందే.