iDreamPost
android-app
ios-app

Presidential Elections 2022 భారతదేశానికి కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

  • Published Jul 21, 2022 | 9:42 PM Updated Updated Jul 21, 2022 | 9:44 PM
Presidential Elections 2022 భారతదేశానికి కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత మొత్తం ఓట్ల విలువలో 50 శాతానికి పైగా ఎన్‌డిఎ అభ్య‌ర్ది ద్రౌపది ముర్ము స్కోర్ చేయడంతో ఆమె రాష్ట్ర‌ప‌తి అయ్యారు. భారతదేశం మొదటి గిరిజన రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకుంది. ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హా ఓటమిని అంగీకరించారు. జులై 25న ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

మూడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ద్రౌపది ముర్ము మొత్తం ఓట్ల విలువలో 53.13 శాతానికిపైగా ఓట్ల‌ను సాధించారు. ఇంకా ఒక రౌండ్ సమయం ఉంది, ఇందులో తొమ్మిది రాష్ట్రాలు , రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఓట్లను లెక్కిస్తున్నారు.


రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌కావ‌డంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్‌లోని సీనియర్ మంత్రులు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కలిసి శ్రీమతి ముర్ముని క‌ల‌సి అభినందించారు. బీజేపీ అంగ‌రంగ వైభవంగా ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది. స్వీట్లు పంచుకున్నారు. రంగురంగుల గిరిజన నృత్యాలతో వేడుక‌లు మొద‌లైయ్యాయి.

“2022 రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో విజయం సాధించినందుకు శ్రీమతి ద్రౌపది ముర్ముని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఆమె రాజ్యాంగ పరిరక్షకురాలిగా, నిర్భయంగా వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నాను. నిజానికి, ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఒక ప్రకటనను విడుద‌ల చేశారు.

ఢిల్లీ బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌పథ్ వరకు రోడ్‌షోతో వేడుకలు చేస్తోంది.