iDreamPost
android-app
ios-app

కల్లు తాగండి – కరోనాను గెలవండి…

కల్లు తాగండి – కరోనాను గెలవండి…

తాగుతూ బ్రతకాలిరా తమ్ముడూ, తాగుతూ సాగాలిరా.. అని పాడుతూ తూగిపోతూ తడబడుతున్న అడుగులతో ఇంటికి సాగిపోతున్నాడు వెంగల్రావు.. కూరగాయల కోసం మార్కెట్ కు బయల్దేరిన అప్పలమ్మకు తూలిపోతూ నిషాతో నడుస్తున్న భర్త వెంగల్రావు ఎదురయ్యాడు..

ఏం మాయరోగం ఇలా ఫూటుగా తాగి చచ్చావ్.. అసలు తాగే అలవాటు లేదు కదా నీకు.. కొత్తగా ఇదేం పాడుబుద్ది అంటూ రోడ్డుపైనే కయ్యిమని అరుస్తూ భర్తపై అంతెత్తున లేచింది..

కనీసం భార్యను గుర్తించే స్థితిలో కూడా వెంగల్రావు లేడు.. తల గిర్రున తిరుగుతూ ఉండడంతో ఎదురుగా మసకమసకగా కనబడుతూ ఏదో చెప్తున్న ఓ స్త్రీ మూర్తి వెంగల్రావుకు కనబడింది. ఆమె మాట్లాడుతున్నదేమి వెంగల్రావు చెవికెక్కడం లేదు.. మత్తులో తప్పటడుగులు వేస్తూ కింద పడబోతుంటే అప్పలమ్మ కింద పడకుండా గట్టిగా పట్టుకుంది.

ఎవరమ్మా నువ్వు నన్ను ఇలా నదిరోడ్డులో పట్టుకుంటున్నావ్.. ఈ విషయం నా భార్య గానీ చూసిందనుకో అట్లకాడ తిరగేసి వాతలు పెడుతుంది. దయచేసి దూరంగా ఉండమ్మా అంటూ వెంగల్రావు మొత్తుకున్నాడు..

తన భర్తకి తనంటే ఉన్న భయానికి మురిసిపోయింది అప్పలమ్మ.. అదీకాక పరాయి స్త్రీని తన వంటిపై చేయి వేయనివ్వకపోవడం మరింతగా నచ్చింది.. అరిచింది చాలు గానీ నువ్వూరుకోవయ్యా.. నేనే నీ భార్యా శిరోమణిని.. కాబట్టి అరవకుండా గోల చేయకుండా నాతో పాటు ఇంటికి రా.. అందరూ చూస్తున్నారు అంటూ లోగొంతుకతో వెంగల్రావుకు చెప్పింది.

ఇవేమీ పట్టించుకునే స్థితిలో వెంగల్రావు లేడు.. తనకి నాతో పాటు ఇంటికి రా అన్న మాట మాత్రమే వినబడటంతో సూర్యకాంతం నువ్వా.. ఇలా అందరిముందు ఇంటికి రమ్మనడం ఏం బాలేదు.. నేను నీ ఇంటికి వస్తున్న విషయం నా భార్యకు తెలిసిందే అనుకో నా తోలు తీసి డోలు వాయిస్తుంది కాబట్టి రేపు సాయంత్రం వస్తాను నా చేయి వదులు అని ముద్దగా తడబడుతున్న మాటలతో అన్నాడు..

అప్పలమ్మ మహోగ్రరూపం దాల్చింది.. అంటే వీడు అప్పుడప్పుడు బయట పని ఉందని చెప్పి వెళ్ళేది ఆ సూర్యకాంతం ఇంటికా అని మనసులో అనుకుని పళ్ళు పటపట కొరికింది. కోపంతో భర్తను ఒక్క విసురు విసిరేసరికి ఇంటిలోకొచ్చి పడ్డాడు. అపర కాళీ అవతారం ఎత్తిన అప్పలమ్మ రెండు బక్కెట్ల నీళ్లు వెంగల్రావుపై గుమ్మరించి అట్లకాడని ఎర్రగా కాల్చి వాతలు పెట్టింది.. మరో చేత్తో అప్పడాల కర్రతో వాయించడంతో వెంగల్రావు మత్తు పూర్తిగా వదిలింది..

ఎందుకే చావబాదుతున్నావ్.. చెప్పి కొట్టవే నీకు దణ్ణం పెడతాను అంటూ కాళ్లావేళ్ళా పడ్డాడు వెంగల్రావు. ఆ సూర్యకాంతం ఇంటికి ఎన్నాళ్ల నుండి వెళ్తున్నావ్ ఆ విషయం చెప్పు నిలదీసింది అప్పలమ్మ…

ఎవరికీ తెలియని నిజం భార్యకు ఎలా తెలిసిందా అంటూ వెంగల్రావు జుట్టు పీక్కున్నాడు.. అదే జుట్టు పట్టుకుని అప్పలమ్మ వాయిస్తూ ఉండడంతో అలాంటిదేమి లేదే నా మాట నమ్ము అంటూ బ్రతిమిలాడాడు..

కరోనాతో జనం అల్లాడుతుంటే ఫూటుగా తాగి అడ్డమైన కొంపల వెంబడి తిరుగుతున్నావా. అసలు నిన్ను నిలువునా ఉప్పు పాతర వేయాలని ఆగ్రహంతో ఊగిపోతుంది అప్పలమ్మ.. ఆ మాట విని వెంగల్రావు పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. అప్పలమ్మ అట్లకాడతో వాతలు పెడుతున్నా అసలీయనకు నవ్వు ఎలా వస్తుందా అని ఆశ్చర్యపోయింది.

ముందా జుట్టు పట్టుకుని కొట్టడం ఆపవే నీకు నిజం చెప్తాను అంటూ మరింతగా నవ్వడం మొదలుపెట్టాడు వెంగల్రావు.. అప్పలమ్మ జుట్టు వదిలేసిన మరుక్షణం వెంగల్రావు తానెందుకు తాగవలసి వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.

కల్లు తాగితే కరోనా రాదట.. కల్లు తాగడం వల్ల కల్లులో ఉన్న రోగ నిరోధక శక్తి కారణంగా శరీరంలో కూడా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా మనకి సోకదే పిచ్చి మొహమా.. గర్వంగా చెప్పాడు వెంగల్రావు.. గుర్రున చూస్తున్న భార్యకు అలా మిడిగుడ్లేసుకుని చూడటం మాని నువ్వు కూడా ఒక నాలుగు లోటాలు కల్లు తాగి రోగ నిరోధక శక్తిని పెంచుకో.అసలే కొత్త కరోనా వైరస్ వస్తుందట.. ఆ కొత్త వైరస్ దెబ్బకు బ్రిటన్ అల్లకల్లోలం అయిపోయింది. అంటూ వివరించే ప్రయత్నం చేసాడు వెంగల్రావు..

నీకు ఈ విషయం చెప్పిన పెద్ద మనిషి ఎవడు? కళ్లెర్రజేస్తూ అడిగింది అప్పలమ్మ.. ఎవరో చెబితే నేనెందుకు నమ్ముతానే.. బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ ఈ విషయం స్వయంగా చెప్పాడు. అంతేకాకుండా ఒక్క చుక్క కల్లు గంగానది నీటికంటే పవిత్రమైనదట తెలుసా నీకు.. ఈ విషయం కూడా ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పాడంటే నిజమే అయ్యి ఉంటుంది. అందుకే కల్లు తాగాను కరోనాను జయించడానికి బయలుదేరాను అంటూ గర్వంగా చెప్పాడు వెంగల్రావు.

ఆ మాటలు విన్న అప్పలమ్మ అపరకాళీ అవతారం ఎత్తింది. ఒకరేమో బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా రాదంటాడు.. మరొకరేమో అప్పడాలు తింటే కరోనా రాదంటాడు.. ఇంకొకరు గోమూత్రం తాగితే కరోనా వచ్చే అవకాశం లేదంటాడు. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం అన్ని మెడికల్ కంపెనీలు అష్టకష్టాలు పడుతుంటే ఏకంగా కరోనాకి మందు కనిపెట్టాం అని ప్రకటనలు ఇస్తాడు మరొకరు. ఆయా మాటలు చెప్పిన వాళ్ళకే కరోనా వచ్చినప్పుడు వాళ్ళు అప్పడాలు తినలేదు, బురదలో కూర్చుని శంఖం ఊదలేదు, గోమూత్రం తాగలేదు. హాస్పిటల్ లో జాయిన్ అయి చికిత్స పొందారు.అలాంటి వాళ్ళ మాటలు విని ఫూటుగా తాగిన నిన్ను ఏం చేసినా పాపం లేదని అరుస్తూ అట్లకాడ కాల్చడానికి బయల్దేరింది అప్పలమ్మ..