జరుగుతున్నాయా? జరిపిస్తున్నారా?

కారణం లేకుండా ఏదీ జరగదు. ముఖ్యంగా తగిన సిద్ధాంతం, ప్రజల ప్రయోజనాలు తదితర ప్రజా ప్రయోజనార్ధ అంశాల్లేకుండా రాజకీయాలు నడుస్తున్నప్పడు ఈ ‘కారణం’ వెతకాల్సిందే. ఇందుకు ఏ ఒక్కరు కూడా ఆక్షేపించరు. ఏపీలో సీయంగా వైఎస్‌ జగన్‌ బాధ్యలు చేపట్టిన తరువాత ఆయనపై మత పరమైన ఆరోపణలు ఎక్కువైపోయాయి. ఎన్నికల ముందు కూడా ఇది కొనసాగినప్పటికీ దాని ప్రయోజనం పెద్దగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదనే చెప్పాలి. అయితే ఫలితాల తరువాత కూడా ఇదే పంథాలను కొనసాగిస్తుండడం శంసయాలు, శంకలను రేకెత్తిస్తోంది.

మరో పక్క ప్రత్యర్ధులు చేసే ఆరోపణలకు అనుగుణంగా పలు ఘటనలు చోటు చేసుకోవడం, అది కూడా రాష్ట్రంలోని కీలక ప్రాంతాలు ఆ సంఘటనలకు వేదికగా నిలవడం పట్ల పలువురు అధికార పార్టీ నేతలకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పదేపదే చెప్పడం ద్వారా అబద్దాన్ని కూడా నిజంగా నమ్మించొచ్చన్న సిద్ధాంతాన్ని పక్కాగా నమ్ముకున్న ప్రతిపక్షాలు తమ ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాల్లో సామాన్యజనంలో కూడా సందేహాల్లేకపోలేదు. ఎక్కడైనా మతపరమైన దుశ్చర్యలు జరిగినప్పుడు, ఆయా సంఘటనల కారణంగా ఎవరికి లబ్దిచేకూరుతుందో వారినే మొట్టమొదటగా అనుమానించాల్సి ఉంటుందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం.

ప్రతి అంశాన్ని బూతద్దంతో చూస్తూ ప్రజా ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యంగా జగన్‌ పాలన సాగిస్తున్నారు. పదవీనెక్కింది మొదలు ఒకదానిపై ఒకటి బరువులు వచ్చిపడుతున్నా పెదవులపై చిరునవ్వులు చెరగనీయకుండా సంక్షేమ విధానంలో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకుతానుగా ఏదో ఒక మతాన్నిగానీ, దేవుడ్నిగానీ ప్రమోట్‌ చేస్తూ గానీ, ఇబ్బంది పెడుతూగానీ ఇతర మతాల వారికి వ్యతిరేకం కావాల్సి అవసరం ఏముంటుంది? అన్న ప్రశ్న జనసమాన్యంలో చురుగ్గానే సాగుతోంది. ధార్మిక క్షేత్రాల్లో ఏదైనా దుశ్చర్యలు జరిగితే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కృషి కూడా చేస్తున్నారు. వీటన్నిటిని ప్రతిపక్షాలు మినహా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జగన్‌పై మతపరమై దాడి కొనసాగుతుండడం గర్హనీయంగానే జనం భావిస్తున్నారు.

జరగరానిది జరిగినప్పుడు లాజిక్‌లేని విమర్శలు చేస్తే మీ పాలనలో ఏం చేసారు? అన్న ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. ఇప్పుడు విమర్శలు చేస్తున్న వాళ్ళు సంయుక్తంగా పాలించినప్పుడు జరిగిన ఘటనలకు బాధ్యత వహించి ఉంటే, ఇప్పుడు జరిగే వాటికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని అడగడానికి సహజంగానే హక్కు ఏర్పడి ఉండేది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలు, చేస్తున్న రచ్చ వారి ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడితే ఉపయోగపడి ఉండొచ్చు తప్ప, జగన్‌కు– జనానికి మధ్యనున్న బాండింగ్‌ను ఏ మాత్రం కదల్చలేదని పరిశీలకులు చెబుతున్న మాట.

Show comments