కరోనా ఖాతాలో మరో ‘సంస్థ’ పరువు

అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడి దేశాలు, డబ్బున్నవాడు, లేనివాడు, ఎంతో అనుభవం ఉన్న సంస్థలు, స్టార్టప్‌లు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థలను కోవిడ్‌ 19 కుదేసి కూర్చోబెడుతోంది. దెబ్బతిన్నవారు పరువుకోసం అన్నీ ఓర్చుకుని కూర్చుంటున్నారు. తప్పని వాళ్ళు రోడ్డున పడుతున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే కోవిడ్‌ కారణంగా భారీ జన నష్టాన్ని నమోదు చేస్తున్నాయి. వెనుకబడి ఆఫ్రికన్‌ దేశాల్లో అంతంత మాత్రంగానే మృత్యువాత పడుతున్నారు. లెక్కల్లో తేడాలుండొచ్చు.. అంటూ ఈ పరిస్థితిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవ పరిస్థితిని దగ్గర్నుంచి పరిశీలిస్తున్న వారికి మాత్రం తేడా స్పష్టంగానే అర్ధమవుతోంది.

అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌కే కరోనా మాస్కుపెట్టించేసింది. ఆ దేశంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు రెండోదశ వ్యాప్తి కూడా ప్రారంభమైపోయిందని అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో.. అమెరికాలోనే అత్యంత ప్రాధాన్యత గల సంస్థగా చెప్పే సెంటర్‌ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ పరువును కూడా ఇప్పడు గంగలో కలిపేందుకు కరోనా సిద్ధమైపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన అనేక అంటు వ్యాధులను ఎదుర్కొవడంలో సీడీసీ అన్ని దేశాలకు స్ఫూర్తిగా నిలిచేంది.

అయితే కోవిడ్‌ విషయంలో మాత్రం సీడీసీ ప్రాధాన్యం ఏ మాత్రం కన్పించడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సీడీసీ కంటే కూడా వెనుకబడిన దేశాల్లోని పలు సంస్థలు చురుగ్గా వ్యవహరించాయని చెబుతున్నారు. ఫలితాలే ప్రామాణికం కాబట్టి అమెరికాలోని పరిస్థితులు, ఇతర వెనుకబడిన దేశాల్లోని పరిస్థితులను బేరీజు వేస్తే ఇదే నిజమన్న అభిప్రాయం ఖరారు చేస్తున్నారు. ఏకంగా అమెరికాలో కోటికి చేరువలో కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా, రెండున్నరలక్షల మందికిపైగా మృత్యువు పాలయ్యారు. ఈ స్థాయి విజృంభణ అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రపంచ దేశాలు ఊహించలేదు.

వెనుకబడిన దేశాలు, జనాభా అత్యధికంగా ఉన్న చోట్ల పరిస్థితి చేయిదాటి పోతుందనే ఊహించారు. అందుకు భిన్నంగా అమెరికా సహా యూరప్‌లోని అన్ని ప్రధాన దేశాలను కోవిడ్‌ కుదుపులకు గురిచేస్తోంది. తద్వారా ఇప్పటి వరకు ఆయా దేశాలు, సంస్థలకు ఉన్న పరువును గంగపాల్జేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ పేరిట హడావిడి చేసిన దేశాలు కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల తరువాత మారుమాట్లాడలేని పరిస్థితిలోకి జారిపోయారు.

అయితే ప్రతిష్టాత్మక సీడీసీ వైఫల్యం ఆ సంస్థ ఒక్కదాని సొంతమేకాదని, ట్రంప్‌ రాజకీయ జోక్యం కారణంగానే ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్న వాదన కూడా బలంగానే విన్పిస్తోంది.

Show comments