లాక్ డౌన్ తర్వాత స్కూళ్ళ స్వరూపం మారిపోతుందా ? టీచర్ల పరిస్దితేంటి ?

అవుననే అంటున్నారు విద్యా వ్యవస్ధలో బాగా అనుభవం ఉన్నవారు, టీచర్ల సంఘాల నేతలు. కరోనా వైరస్ దెబ్బతో మామూలుగా కన్నా ముందే విద్యార్ధులకు, టీచర్లకు సెలవులు వచ్చేశాయి. పనిలో పనిగా విద్యా సంవత్సరం ముగిసే సమయానికి మొదలయ్యే షెడ్యూల్ సెలవులు ఇపుడు తోడయ్యాయి. దాంతో చాలామంది విద్యార్ధులు, టీచర్ల ఇళ్ళకే పరిమితమైపోయారు. అంతా బాగానే ఉంది మరి రేపు జూన్ 12వ తేదీన మళ్ళీ స్కూళ్ళు తెరిస్తే పరిస్ధితి ఏమిటి ?

ఇపుడీ అంశంపైనే ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కరోనా వైరస్ భారిన విద్యార్ధులు పడకూడదనే ముందుగానే లాక్ డౌన్ పేరుతో స్కూళ్ళను మూసేశారు. ఇలా ఎంతకాలం స్కూళ్ళను మూసేస్తారు ? రేపు జూన్ 12వ తేదీకైతే విద్యా సంస్ధలను తెరవాలి కదా ? మరప్పుడు కరోనా వైరస్ సమస్య మాటేమిటి ? ఎందుకంటే లాక్ డౌన్ అమల్లో ఉన్నా సమస్య పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. ఈ నేపధ్యంలో జూన్ నాటికి వైరస్ సమస్య అదుపులోకి వస్తుందనే ఆశలు కూడా ఎవరిలోను కనబడటం లేదు. మరపుడు ఏమి చేయాలన్నదే పెద్ద సమస్య.

ఎందుకంటే మన స్కూళ్ళల్లో లెక్కకుమించి విద్యార్ధులుంటారు. ఒక్కసారిగా వేలాది మంది పిల్లలు ఒకేచోట గుమిగూడినపుడు వైరస్ సమస్య మొదలైతే ఆపటం ఎవరి తరం కాదు. సరిగ్గా ఇక్కడే కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఎన్సీఈఆర్టితో చర్చలు జరిపిందని సమాచారం. ఎన్సీఈఆర్టీ అనేది స్కూళ్ళల్లో విద్యా ప్రమాణాలు, సిలబస్ తదితరాలను పరిశీలిస్తుంటుంది. జూన్ 12 తర్వాత స్కూళ్ళు తెరిచినపుడు ఎలాంటి ప్రమాణాలు, ముందు జాగ్రత్తలు పాటించాలో చెప్పమని ఎన్సీఈఆర్టీని మానవ వనరుల అభివృద్ధి శాఖ కోరిందట.

ఎన్సీఈఆర్టీ స్కూళ్ళ పరిస్ధితులపై అధ్యయనం చేసి కొన్ని సిఫారసులు చేసిందట. దాని ప్రకారం పిల్లలకు రోజు మార్చి రోజు స్కూళ్ళకు హాజరయ్యేట్లు చేయాలట. ఉదాహరణకు ఓ క్లాసులో 50 మంది పిల్లలున్నారని అనుకుందాం. వీరిలో 25 మందిని ఒకరోజు మిగిలిన 25 మందిని ఇంకోరోజు స్కూలుకు వచ్చేట్లు చేయటం. అంటే మొదటి 25 మంది సోమవారం స్కూలుకు వస్తారు. మిగిలిన వాళ్ళు మంగళవారం వస్తారు. సోమవారం స్కూలుకు వచ్చిన విద్యార్ధులు మళ్ళీ బుధవారం స్కూలుకొస్తారన్నమాట.

రోజు మార్చి రోజు విద్యార్ధులను స్కూలుకు రప్పించటం వల్ల క్లాసుల్లో రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అదే సమయంలో ఇంట్లో ఉండే విద్యార్ధులకు టీచర్లు క్లాసులను ఆన్ లైన్లో కూడా తీసుకోవాలన్నది ఓ సూచనట. విద్యార్ధుల కోణంలో బాగానే ఉంది. మరి టీచర్ల మాటేమిటి. చెప్పిన పాఠాలే రెండు సార్లు చెప్పాలా ? అలాగే ఆన్ లైన్లో చెప్పే పాఠాలు విద్యార్ధులకు ఎవరు చెప్పాలి ?

ఒక్కోపాఠాన్ని రెండు సార్లు చెప్పుకుంటూ పోవటం, ఆన్ లైన్లో పాఠాలు చెప్పటం మొదలుపెడితే టీచర్లపై పెరిగిపోయే పనిభారం మాటేమిటి ? విద్యా సంవత్సరం ఎప్పటికి పూర్తవుతుంది ? అనే విషయాలపైన టీచర్ల సంఘాలతో కూడా ఎన్సీఈఆర్టీ చర్చలు జరుపుతోంది. ఏదేమైనా తొందరలోనే ఎన్సీఈఆర్టీ ఇచ్చే నివేదికతో స్కూళ్ళు, సిలబస్ స్వరూపాలైతే మారిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ?

Show comments