iDreamPost
android-app
ios-app

బాబు బాటలో సోము వీర్రాజు పయనిస్తున్నారా..?

బాబు బాటలో సోము వీర్రాజు పయనిస్తున్నారా..?

ఫ్లైట్‌ హైజాక్‌లు చూశాం. ఆ మాట విన్నాం. ఇదే తరహాలోనే క్రెడిట్‌ హైజాక్‌లు అన్ని చోట్లా ఉన్నాయి. ఒకరు చేసిన పని తాము చేశామని, తమ వల్లే జరిగిందని చెప్పుకోవడాన్నే క్రెడిట్‌ హైజాక్‌ అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జరిగే క్రెడిట్‌ హైజాక్‌లు బయట ప్రపంచానికి పెద్దగా కనిపించవు. కానీ రాజకీయాల్లో జరిగే క్రెడిట్‌ హైజాక్‌లు మాత్రం బయట ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంటాయి. ఒకరు చేసిన పనిని తాము చేశామని లేదా తమ వల్లే జరిగిందని చెప్పుకోవడానికి రాజకీయ నేతలు కొంతమంది ఏ మాత్రం సంకోచించరు.

అసలు రాజకీయాల్లో క్రెడిట్‌ హైజాక్‌ అనే మాట బాగా వాడుకలోకి వచ్చేందుకు కృషి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగానే కాదు, ప్రపంచంలో ఏది జరిగినా నా వల్లే, నేనే.. అని చెప్పుకోవడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని చెబుతుంటారు. హైదరాబాద్‌ను నేనే కట్టానని, రింగు రోడ్డు, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు తానే కట్టానని, డ్వాక్రా సంఘాలను కనిపెట్టానని, పీవీ సింధూ షటిల్‌ ఆడేందుకు తానే స్ఫూర్తి అని, సత్యనాదెళ్ల తన వల్లే సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించాడని.. ఇలా చెప్పుకుంటూ వస్తే ఇటీవల భారత్‌ బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్‌ తన స్ఫూర్తితోనే కనిపెట్టిందనే వరకూ ఎన్నో ఉన్నాయి. ప్రజలు నవ్వుతున్నా బాబు మాత్రం తనదారి తనదే అన్నట్లు సాగిపోతున్నారు. బాబు తీరు గమనించిన వారు ఇక.. ఆయన ఇంతే అని అనుకుంటున్నారు.

చంద్రబాబు ఒక్కడే అనుకుంటే.. ఇప్పుడు ఆయన దారిలో బీజేపీ రాష్ట్ర సారధి సోము వీర్రాజు కూడా పయనిస్తున్నారా..? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎంపీడీవోలకు ప్రమోషన్ల కోసం డీడీ పోస్టులను జగన్‌ సర్కార్‌ సృష్టిస్తే.. తాను మండలిలో ప్రస్తావించడం వల్లనే అవి వచ్చాయని సోము వీర్రాజు చెప్పుకుంటున్నారు. అంతేకాదు మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంటే.. అది కూడా సీఎం వైఎస్‌ జగన్‌ను మే నెలలో కలసి వినతి ఇవ్వడం వల్లే అంటూ నిస్సంకోచంగా చెప్పుకుంటున్నారు.

ఈ విషయాలపై సోషల్‌ మీడియాలోనూ పోస్టులు పెట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు లాగే సోము వీర్రాజు కూడా ప్రవర్తిస్తున్నారని, ఆయన లాగే సోము కూడా నవ్వులపాలు అవ్వొద్దంటూ నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ రమ్మీని ఏపీలో మాదిరిగానే దేశం మొత్తం నిషేధించేలా కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ పాలకులకు చెప్పి చేపించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ డిమాండ్‌కు మద్ధతు భారీగా వస్తోంది. మరి నెటిజన్ల డిమాండ్‌ మేరకు సోము వీర్రాజు ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తారా..? లేదా..? చూడాలి.