iDreamPost
android-app
ios-app

పీకే ఆ పని చేస్తారా…?

పీకే ఆ పని చేస్తారా…?

2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా కాంగ్రెస్ సీనియర్లతో సోనియాగాంధీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 16, 18, 19 తేదీల్లో పీకే, కాంగ్రెస్ నేతలతో సమావేశమైన సోనియా రాబోయే రోజుల్లో మరి కొన్ని సమావేశాలు నిర్వహించనున్నారు. 10 జనపథ్ లో జరుగుతున్న ఈ భేటీల్లో కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, ఎకె ఆంటోనీ, అంబికా సోనీ, రణదీప్ సూర్జేవాలా సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరవచ్చనే ఊహాగానాల మధ్య గత నాలుగు రోజుల్లో సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మధ్య మూడో సమావేశం మంగళవారం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌తో కూడిన వివరణాత్మక ప్రజెంటేషన్‌ను ఇప్పటికే సోనియాగాంధీకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారు.

2024 సార్వత్రిక ఎన్నికల కోసం 370 లోక్‌సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని పీకే సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దత పైనా పీకే, కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కిషోర్‌తో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దేశంలో బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు మూలాధారంగా నిలవాలని భావిస్తోంది.

ఎన్నికల వ్యూహకర్తగా పీకేకు మంచి పేరు ఉంది. బీజేపీ సహా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీహార్‌లో జేడీయూలకు ఆయన వ్యూహకర్తగా పని చేశారు. జేడీయూలో చేరి ఆ పార్టీ ఉపాధ్యక్షుడుగా కూడా కొంతకాలం పని చేశారు. జేడీయూ మళ్లీ ఎన్‌డీఏలో చేరడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉండడంతోనే పీకే కాంగ్రెస్‌ పార్టీలో చేరే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. పీకే పార్టీలో చేరితే.. పార్టీ నేతగా, వ్యూహకర్తగా ఆయన సేవలు కాంగ్రెస్‌కు అందనున్నాయి. మరి పీకే పార్టీలో చేరతారా…? లేక వ్యూహకర్తగానే ఉంటారా..? మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.