iDreamPost
android-app
ios-app

టీడీపీ హయాంలోనే పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆగడాలు

  • Published Jan 19, 2021 | 12:04 PM Updated Updated Jan 19, 2021 | 12:04 PM
టీడీపీ హయాంలోనే పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆగడాలు

ఏ రాష్ట్రంలో అయిన ప్రతిపక్షం గా చెప్పుకునే రాజకీయ పార్టీ పోషించే నిర్మాణాత్మకమైన పాత్రమీదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఆదారపడి ఉంటుందని అంటారు. ప్రభుత్వ పనితీరుని పర్యవేక్షించడమే ప్రతిపక్ష పనిగా చెబుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం తీరు చూస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ మాట అటు ఉంచి వారు స్వార్ధ రాజకీయల కోసం లేవనెత్తుతున్న అంశాలు అధికార కాంక్షతో అల్లుతున్నకట్టుకధలు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే భాద్యత తీసుకున్నారా అనే అనుమానం కలగక మానదు.

జగన్ తన పాదయాత్రలో చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలకు తన పాలనపై విమర్శించే అవకాశం ఇవ్వకుండా పాలన సాగిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా పట్టుబిగిస్తుండటం, విమర్శకులు సైతం జగన్ పాలన భేష్ అంటూ కీర్తించడంతో రాజకీయంగా పతనం అంచున ఉన్న తెలుగుదేశం ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే విధంగా జగన్‌పై మతతత్వ దాడిని మొదలుపెట్టింది.

తొలుత జగన్ అధికారంలోకి రాగానే ఆలయాలపై దాడులు పెరిగాయని హిందూ దేవాలయాలకు జగన్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం మతవాదాన్ని భుజాన వేసుకుని యాగీ చేస్తుంది.దీంతోపాటు మతసామర్యాన్ని దెబ్బతీసేలా రాష్ట్రంలో అశాంతిని పెంచేలా తెలుగుదేశం చేస్తున్నఈ కువిమర్శలు రాష్ట్రంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదముందని గ్రహించిన ప్రభుత్వం విచారణకై పోలీసులని రంగంలోకి దింపింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాల దాడుల నేపధ్యాన్ని చేధించి విస్తుపోయే వాస్తవాలను ప్రజల ముందు పెట్టారు.

రాష్ట్రంలో ఆలయాల పై దాడుల వెనక తెలుగుదేశం ముఖ్యపాత్ర ఉందని,పలు ఆలయాలపై దాడులలో తెలుగుదేశం క్యాడర్ ప్రత్యక్ష పాత్ర ఉందని. కావాలనే ప్రభుత్వంపై బురదజలేందుకు ఈ విధమైన కార్యక్రమాన్ని తెలుగుదేశం చేస్తుందని పూర్తి వివరాలు, పేరులు, సాక్షాలతో సహా మీడియా ముందు ప్రవేశ పెట్టారు రాష్ట్ర డీజీపీ. అంతే కాకుండా ఇప్పటి పాలనలో కన్నా తెలుగుదేశం పాలనా హయాంలోనే హిందూ ఆలయాలపై ఎక్కువ దాడులు జరిగాయని లెక్కలతో సహా బహిర్గతం చేశారు. డీజీపీ ఇచ్చిన లెక్కలతో, చూపిన సాక్షాలతో, తెలుగుదేశం బండారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం అప్రమత్తం అయి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పేరును తెరపైకి తెచ్చి ప్రజలను దృష్టి మరల్చి మభ్యపెట్టాలనే ఎజండాని అమలు చేసింది.

ఆలయాల పై జరుగుతున్న దాడుల కేసును చేదిస్తున్న పోలీసులకి వచ్చిన ఫిర్యాదు మేరకు అనేక మందితో పాటు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిను కుడా అరెస్టు చేశారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం పాస్టర్ ప్రవీణ్ కు వైసీపి నేతలకు మధ్య సంబందాలు ఉన్నాయని, వారి ప్రోద్బలంతోనే ఆలయాలపై పాస్టర్ ప్రవీణ్ దాడులు చేశాడని ఈ వ్యవహారంపై ఎందుకు పోలీసులు నోరు మెదపడంలేదని వర్ల రామయ్య లాంటి వారు మీడియా ముఖంగా ప్రశ్నలు వేశారు. ఇక తెలుగుదేశానికి పాంప్లేట్ లా పని చేసే ఆంద్రజ్యోతి పాస్టర్ ప్రవీణ్ తానే ఆలయాలపై దాడులు జరిపినట్టు ఒప్పుకున్నాడని ఇతను వైసీపి కి దగ్గర మనిషి అని అసత్యాలతో కధనాన్ని ప్రచురించింది.

ఈ వ్యవహారంలో నిజానిజాలు చూస్తే తెలుగుదేశం చేస్తున్న అసత్యప్రచారాలు ఎంత భయంకరంగా ఉంటాయో అర్ధం అవుతుంది. నిజానికి పాస్టర్ ప్రవీణ్ విడుదల చేసిన వీడియో 2013లోది అయినా తాజాగా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారులు తనని అరెస్టు చేశారు.. కానీ తెలుగుదేశం మాత్రం ఆ వీడియో ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో విడుదల చేసిందే అన్నట్టు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కుట్రపూరితంగా తమ కార్యకర్తల చేత ఆలయాలపై చేయించిన దాడులని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇక పాస్టర్ ప్రవీణ్ కుమార్ గత చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీతో తనకు సాన్నిహిత్యం ఉన్నట్టు తెలుస్తుంది.

కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పై గతంలో 6 కేసులు నమోదవ్వగా తెలుగుదేశం పాలనలో కోర్టు వరకు వెళ్లకుండానే మూడు కేసులు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఎత్తివేసినట్టు , 2కేసుల్లో హైకోర్టులో స్టే తెచ్చుకున్నట్టు ఒక కేసు న్యాయస్థానం తొలగించినట్టు సమాచారం . అంతేకాకుండా పాస్టర్ ప్రవీణ్ ఒక దళిత మహిళను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సదరు మహిళ ఎంత మొరపెట్టుకున్న అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు నాడు హోం మంత్రిగా ఉన్న చినరాజప్ప కనీసం ఆమె గోడు వినే ప్రయత్నం కూదా చేయలేదని ఈ ఉదంతాన్ని మొత్తం ఆనాడే సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ నేత సునీల్ దియొధర్ సైతం తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ప్రవీణ్ చక్రవర్తి తెలుగుదేశం పాలనా హయాంలోనే మత మార్పిడి కార్యక్రమాలు చేశాడని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు జై శ్రీరాం అనటం మోసమే అని అభివర్ణించారు.

ఇక పాస్టర్ ప్రవీణ్ వైసీపీ నేత వంగా గీతాతో ఉన్న ఫోటోకి సంబందించి, యూరో లాటరి మోసంలో కోలా కృష్ణ మోహన్, హఫీజ్ పేట కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, దొంగనోట్ల కేసులో రామకృష్ణ గౌడ్, నకిలీ స్టాంపుల కుంభకోణం కృష్ణ యాదవ్ తో ఫోటోలు దిగిన చంద్రబాబు ఆ కేసులతో  సంబంధం లేనప్పుడు తమకి మాత్రం నియోజక వర్గంలో వివిద కార్యల్రమాలకి వెళ్ళిన సమయంలో కొన్ని వందల మందితో ఫోటోలు దిగవలసి వస్తుందని అందులో ఎవరైనా ఏదైనా నేరంలో భాగస్వామ్యులు అయినప్పుడు తమకి ఎలా సంబంధం ఉంటుందో తెలుగుదేశం నేతలే చెప్పాలని, దేవాలయలపై దాడుల విషయంలో సాక్షాలతో సహా తెలుగుదేశం వాళ్ళు దొరికిపోవడంతోనే ప్రజలను మభ్యపెట్టటానికి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకి చంద్రబాబు ఏమి సమాధానం చెప్తాడో వేచి చూడాలి.

ఏది ఏమైనా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఒక పక్క దేవాలయాలపై దాడులకు వారి క్యాడర్‌ను వాడి ఆ నిందని జగన్ ప్రభుత్వంపై వేయాలని చేసిన ప్రయత్నం పోలీసుల రంగప్రవేశంతో విఫలం అయిందనే చెప్పాలి.ఇప్పటికైనా తెలుగుదేశం మతతత్వ రాజకీయలను వీడి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రజాస్వామ్య విలువలకి లోబడి వ్యవహరించాలని ప్రజాస్వామ్య వాదుల కోరిక టీడీపీ వారు నెరవేరుస్తారో లేదో చూడాలి .