iDreamPost
android-app
ios-app

టీటీడీ – తెల్ల ఏనుగులు – విష ప్ర‌చారం

టీటీడీ – తెల్ల ఏనుగులు – విష ప్ర‌చారం

టీటీడీ నిర‌ర్థ‌క ఆస్తుల గురించి చ‌ర్చ జ‌రిగింది. నిర్ణ‌య ఉప‌సంహ‌ర‌ణ కూడా జ‌రిగిపోయింది. 20 ఏళ్లు తిరుప‌తిలో జ‌ర్న‌లిస్టుగా ఉన్నాను. టీటీడీ గురించి బాగా తెలిసిన వాడిగా కొన్ని విష‌యాలు చెప్పాలి.

కౌపీన సంర‌క్ష‌ణార్థం అని ఒక క‌థ ఉంది. త‌ప‌స్సు చేసుకుంటున్న ఒక ముని కౌపీనం (పంచె) ఎలుక‌లు తినేశాయి. దీన్ని నివారించ‌డానికి ఆయ‌న ఓ పిల్లిని పెంచాడు. పిల్లికి పాలు కావాలి. ఒక అవును కొన్నాడు. దాన్ని చూసుకోడానికి మ‌నిషి కావాలి. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లాన్ని సాక‌డానికి డ‌బ్బు కావాలి. వెళ్లి ప‌నికి కుదురుకున్నాడు. త‌ప‌స్సు గంగ‌లో క‌లిసిపోయింది. చిరుగులు కుట్టుకుంటే ఏ గొడ‌వా ఉండేది కాదు. ఇప్పుడు చిరిగి చాటైంది.

ఇప్పుడు టీటీడీ క‌థ చెప్పుకుందాం. హ‌రిద్వార్‌లో ఒక ప‌నిలేని సాధువు ఆరు గోవుల్ని టీటీడీకి ఇచ్చాడ‌నుకుందాం. వాటికి గోశాల కావాలి. అంటే స్థ‌లానికి రెంట్ క‌ట్టాలి. కాప‌లాదారు ఉండాలి. వాడి జీతం రూ.10 వేలు. తిరుప‌తిలో మ‌న‌కు న‌చ్చ‌ని ఉద్యోగిని అధికారులు హ‌రిద్వార్‌కి బ‌దిలీ చేస్తారు. వాడు స‌రిగా ప‌నిచేయ‌డు. ప‌ని చేస్తున్నాడా లేడా అని సూప‌ర్‌వైజ్ చేయ డానికి అప్పుడ‌ప్పుడు ఒక అధికారి త‌న బృందంతో హ‌రిద్వార్ వెళ్తాడు. అవుల‌కి గ‌డ్డి కావాలి. టీటీడీలో ప్ర‌తి ప‌నికి ఒక ప‌ద్ధ‌తి ఉంటుంది. టెండ‌ర్ పిలుస్తారు. దాంట్లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని ఎవ‌డో పిటిష‌న్ వేస్తాడు. విచారించ‌డానికి ఒక అధికారి వెళ్తాడు. ఆవులు పాలిస్తాయి కాబ‌ట్టి ఆ లెక్క రాయ‌డానికి ఒక‌ క్ల‌ర్క్ కావాలి.

ఇదంతా చేయ‌కుండా ఆ ఆవుల్ని ఒక రైతుకి అమ్మితే వాడు పెళ్లాం పిల్ల‌ల‌తో బ‌తుకుతాడు. ఆ ప‌ని చేస్తే భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి చేయ‌రు. చేస్తే రాజ‌కీయ నాయ‌కుల మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. ఈ మొత్తం ప్రాసెస్‌లో వృథా అయ్యే డ‌బ్బు ఎవ‌రిది? భ‌క్తుల‌ది. వాళ్లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుని స్వామి మీద భ‌క్తితో హుండీల్లో వేస్తారు. ఎందుకేస్తారంటే టీటీడీ అనేది ధార్మిక సంస్థ కాబ‌ట్టి. ప్ర‌పంచంలోనే అనేక విధాలుగా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న సంస్థ కాబ‌ట్టి.

ఇప్పుడు ఇంకో క‌థ‌. కంచిలో ఒకాయ‌న‌కి ప‌ది సెంట్ల స్థ‌లం ఉంది. అది కోర్టు వివాదంలో ఉంది. ఈ గొడ‌వంతా ప‌డ‌లేని ఆయ‌న ఆస్తి కాగితాల‌ని హుండీలో వేసి వెళ్లాడు. టీటీడీలో ఎస్టేట్ విభాగం, లా విభాగం ఉంటాయి. వాళ్లు ఆ కాగితాల‌తో కోర్టుకు వెళ్లారు. స‌హ‌జంగా జ‌డ్జీలు దేవుడికి వ్య‌తిరేకంగా తీర్పు చెప్ప‌రు కాబ‌ట్టి స్థ‌లం టీటీడీ ప‌ర‌మ‌వుతుంది. ఉద్యోగుల జీత‌భ‌త్యాలు ట్రావెలింగ్ అల‌వెన్స్ ప‌క్క‌న పెడితే కోర్టు ఖ‌ర్చులు ఒక ల‌క్ష అయింద‌నుకుందాం.

ఈ ప‌ది సెంట్ల విలువ రూ.20 ల‌క్ష‌లు అనుకుంటే, దాన్ని కాపాడుకోవ‌డానికి ల‌క్ష రూపాయ‌ల‌తో కంచె లేదా ప్ర‌హ‌రీ గోడ నిర్మిస్తారు. కొంత కాలానికి ఎవ‌డో ఒక‌డు దాన్ని క‌బ్జా చేస్తాడు. మ‌ళ్లీ కోర్టు ఖ‌ర్చులు.

ఇదంతా కాద‌నుకుని ఈ సారి షాపింగ్ కాంప్లెక్స్ క‌ట్టాల‌నుకుంటారు. దానికి టెండ‌ర్‌. రూ.30 ల‌క్ష‌ల‌తో 20 షాపులు క‌డ‌తారు. టీటీడీ కాబ‌ట్టి పెద్ద‌గా అద్దె ఇవ్వ‌రు. ఒక షాపుకి రూ.2 వేలు అనుకుంటే నెల‌కు రూ.40 వేలు. దీనికి గాను ఇద్ద‌రు ఉద్యోగుల్ని నియ‌మిస్తారు. వాళ్ల జీతం నెల‌కు రూ.50 వేలు. మ‌ధ్య‌లో ఆస్తి ప‌రిర‌క్ష‌ణ‌కి ఎస్టేట్ ఆఫీస‌ర్స్ చెకింగ్‌కి వ‌స్తారు. ఇదంతా జ‌రుగుతూ ఉండ‌గా ఆ స్థ‌లం త‌న‌ద‌ని ఎవ‌డో పై కోర్టుకి వెళ్తాడు. దానికి లాయ‌ర్లు, లా ఆఫీస‌ర్ల ఖ‌ర్చులు రూ.20 ల‌క్ష‌ల స్థ‌లాన్ని ప‌రిర‌క్షించ‌డానికి క‌నీసం కోటి రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది. ఇదంతా భ‌క్తుల డ‌బ్బే. ఆ స్థ‌లాన్ని అమ్మితే గోల‌, గొడ‌వ‌.

టీటీడీకి డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో తెలుసా? స‌ంప‌న్నుల సంగ‌తి ప‌క్క‌న పెడితే , పేద‌వాళ్లు వేసే డ‌బ్బులు కూడా త‌క్కువేం కాదు.

మా ఊళ్లో ఒకావిడ ఉండేది. తెల్లారి నాలుగుకి లేచి పేడ క‌సువు ఊడ్చి , నాలుగు ఎనుముల పాలు పిండేది. ఇళ్లిళ్లు తిరిగి అమ్మేది. ఆమె భ‌ర్త రోజుకి 8 గంట‌లు పొలం ప‌ని చేసేవాడు. వాళ్ల‌కొచ్చే ప్ర‌తి పైసా చెమ‌ట‌తో త‌డిసి వచ్చేది. 1970లో నెల‌కి రూ.20 ఆవిడ ఇంట్లో ఉన్న హుండీలో వేసేది. రెండేళ్ల‌కోసారి భార్యాభ‌ర్త‌లు హుండీతో తిరుమ‌ల వెళ్లి , ఆ డ‌బ్బుని స్వామి వారి హుండీలో వేసేవాళ్లు. ఎంతో మంది క‌ష్ట జీవులు స్వామిని న‌మ్మి , త‌న డ‌బ్బు స‌ద్వినియోగం అవుతుంద‌ని న‌మ్మి హుండీలో వేస్తున్నారు. అది వృథా అయితే మ‌నోభావాలు దెబ్బ‌తిన‌వా?

తిరుప‌తిలో ప‌దేళ్ల క్రితం మెట్ల దారిలో ఒకాయ‌న క‌న‌ప‌డ్డాడు. భుజం మీద గ్యాస్ సిలిండ‌ర్ మోస్తున్నాడు. మామూలుగా న‌డిస్తేనే ఆయాసం, నిండు సిలండ‌ర్‌తో మెట్లు ఎక్క‌డం…ఊహ‌కే అంద‌లేదు.

గాలి గోపురం ద‌గ్గ‌రున్న చిన్న‌చిన్న హోట‌ళ్ల‌కి సిలిండ‌ర్ ఇస్తాడు. ఘాట్లో సిలిండ‌ర్‌ని అనుమ‌తించ‌రు కాబ‌ట్టి ఈ శ్ర‌మ‌. దీనికి రూ.200 వ‌స్తుంది. ఆ డ‌బ్బులో కూడా నెల‌నెలా స్వామి వారి హుండీలో కొంత వేస్తాడ‌ట‌. నిజానికి ఆయ‌న వేసే ప్ర‌తి రూపాయి కూడా ల‌క్ష రూపాయిల‌తో స‌మానం.

ఇంత క‌ష్ట‌ప‌డిన డ‌బ్బుని హుండీలో ఎందుకేస్తావ‌ని అడిగితే “ఆయ‌న శ్రీ‌నివాసుడు ఉంటేనే క‌దా సార్‌…మాలాంటోళ్లు బ‌తికేది” అన్నాడు. భ‌క్తుల మ‌నోభావం అంటే ఇది.

నిరర్థ‌క ఆస్తులు అమ్మ‌డం క‌రెక్ట్ నిర్ణ‌యం. ఆ తెల్ల ఏనుగుల్ని ప‌రిర‌క్షించ‌డానికి ఇప్ప‌టికే చాలా డ‌బ్బు వృథా అయింది. వాస్త‌వానికి దేవుడి సొమ్ము వేస్ట్ అయితేనే భ‌క్తులు బాధ‌ప‌డ‌తారు.

టీటీడీ అంటే దేవుడి సంస్థ‌. ఒక‌సారి తిరుప‌తిలోని బాల‌మందిర్ చూస్తే టీటీడీ గొప్ప‌త‌నం అర్థ‌మ‌వుతుంది. అనాథ పిల్ల‌ల్ని చ‌దివిస్తారు. అక్క‌డ చ‌దివి టీటీడీలోనే పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లున్నారు. కుష్టురోగుల కేంద్రం , బ‌ధిరుల పాఠ‌శాల‌, కార్పొరేట్ స్థాయిలో స్విమ్స్ ఆస్ప‌త్రి, దేశంలోనే పేరుగాంచిన బ‌ర్డ్ ఆస్ప‌త్రి, స్కూళ్లు, క‌ళాశాల‌లు చెబుతూ వెళితే టీటీడీ నీడ‌లో ఉండే జాబితా చాలా పెద్ద‌ద‌వుతుంది.

అన్నిటికి మించి అన్న‌దానం.( ప్ర‌తిరోజు కొన్ని వేల మంది భోజ‌నం చేసే అన్న‌దాన కాంప్లెక్స్ ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా లేదు. క‌రుణాక‌ర్‌రెడ్డి చైర్మ‌న్‌గా ఉన్న‌ప్పుడు ముద్ద‌ప‌ప్పు, నెయ్యి ఘుమ‌ఘుమ‌లు ఉండేవి. ఆ త‌ర్వాత అవి మాయ‌మ‌య్యాయి)

వీట‌న్నిటికి డ‌బ్బులు కావాలంటే, వ‌చ్చే డ‌బ్బులు వృథా కాకుండా ఉండాలి. ఇప్పుడు రాజ‌కీయాల‌కి వ‌ద్దాం. నిర‌ర్థ‌క ఆస్తులు అమ్మ‌కానికి పెట్టిన విలువ కోటి చిల్ల‌ర‌. వెంట‌నే గుండెలు బాదుకుంటూ ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు బ్యాన‌ర్ హెడ్డింగులు. ఈనాడు ఒక అడుగు ముందుకేసి కాంచ‌న స్థ‌ల పురాణం కూడా చెప్పింది. నిర‌ర్థ‌క ఆస్తుల‌కి, కాంచ‌న స్థ‌లానికి ఏం సంబంధం?

ప్ర‌తిప‌క్షాలు ఆశా జీవులు. దేవుడి సొమ్ము మీద గోల చేస్తే జ‌నం సుల‌భంగా న‌మ్ముతార‌ని ఆశ‌. అందులోనూ జ‌గ‌న్‌కి హిందూ వ్య‌తిరేక ముద్ర వేయాల‌ని త‌హ‌త‌హ‌. 2012లో జ‌గ‌న్ తిరుమ‌లకి వ‌చ్చిన‌ప్పుడు కూడా అన్నీ అబ‌ద్ధాలే ప్ర‌చారం చేశారు. కానీ జ‌నం న‌మ్మ‌లేదు. జ‌గ‌న్ మ‌నోభావాలు జ‌నానికి తెలుసు.

వీళ్ల ప‌రిస్థితి చూస్తుంటే త‌ల‌నీలాలు వేలం వేసినా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తింటాయ‌ని అంటారేమో! అన‌వ‌స‌ర రాజ‌కీయం చేయ‌కుండా మ‌న‌సు , భావం ఏకం చేసి ఆలోచిస్తే వాస్త‌వం అర్థ‌మ‌వుతుంది.