iDreamPost
android-app
ios-app

కొల్లు రవీంద్రపై వివక్ష ఎందుకు..?

కొల్లు రవీంద్రపై వివక్ష ఎందుకు..?

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీతకన్ను వేశారా..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీకి యువ నేత నారా లోకేష్‌ కొల్లు రవీంద్ర పట్ట వివక్ష చూపుతున్నారా..? అంటే టీడీపీ వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న కారణం లోకేష్‌ పరామర్శకు రావకపోవడం. గత ఏడాది టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో లోకేష్‌ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వయస్సు రీత్యానో లేదా లోకేష్‌ను తీర్చిదిద్దడానికో ఇటీవల చంద్రబాబు జూమ్‌ ప్రెస్‌మీట్లు, వీడియో సమావేశాలకు పరిమితయ్యారు. క్షేత్రస్థాయి పర్యటనలు, పరామర్శలు అన్నింటికీ లోకేష్‌ను పంపుతున్నారు.

ఇటీవల టీడీపీ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు వివిధ కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్‌లు అవుతున్నారు. 150 కోట్ల రూపాయల ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ఆ వెంటనే లోకేష్‌ శ్రీకాకుళం వెళ్లారు. అచ్చెం నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. వారి ఇంట్లోనే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి అచ్చెం నాయుడు అరెస్ట్‌ను ఖండించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందిని, అన్యాయంగా అచ్చెం నాయుడును అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.

అచ్చెం నాయుడు పరామర్శ ముగిసిన కొద్ది రోజులకే ఫోర్జరీ పత్రాలతో వాహనాలు విక్రయించిన కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, గత ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలోనూ లోకేష్‌ విజయవాడ నుంచి తాడిపత్రికి వెళ్లారు. కరోనా సమయంలో ఇంత దూరం ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటుందని జేసీ బ్రదర్స్‌ సున్నితంగా వారించినా లోకేష్‌ పట్టువిడవలేదు. తమ పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు తాడిపత్రి వెళ్లారు. జేసీ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రెస్‌మీట్‌ పెట్టి జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల అరెస్ట్‌ను ఖండించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అంతకు ముందే పై రెండు ఘటనలు జరిగిన మరుక్షణమే ట్విట్టర్‌లో స్పందించారు.

అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్‌ రెడ్డిల విషయంలో ఇంత వేగంగా స్పందించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేష్‌ను పంపించిన చంద్రబాబు.. విజయవాడకు పక్కనే ఉన్న మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రం ఇప్పటి వరకూ పంపకుండా వివక్ష చూపుతున్నారు. ఈ వివక్షకు కారణం ఏమిటి..? అనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో మెదులతోంది. అచ్చెం నాయుడు అవినీతి కేసులో, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫోర్జరీ పత్రాల కేసులో అరెస్ట్‌ కాగా కొల్లు రవీంద్ర హత్య కేసులో అరెస్ట్‌ అయ్యారు. అందుకే లోకేష్‌ పరామర్శకు రాకుండా ట్విట్టర్‌లో, చంద్రబాబు జూమ్‌ ప్రెస్‌మీట్‌లో ఖండిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీలోనే నేతల మధ్య పక్షపాత వైఖరి చూపుతున్నారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

కొల్లు రవీంద్ర ఈ నెల 3వ తేదీన అరెస్ట్‌ అయ్యారు. ఇప్పటికి నాలుగు రోజులవుతోంది. మాజీ ప్రజాప్రతినిధులు దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ వంటి నేతలు కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించారు గానీ తాడేపల్లిలోనే ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.