Idream media
Idream media
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ కొత్త సారథి ఎంపిక అధిష్ఠానానికి ఓ ప్రహసనంగా మారింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎట్టకేలకు ఎంపిక ఫైనల్ కు చేరినట్లు తెలిసింది. ఢిల్లీలో ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ల తో పాటు…మధు యాష్కీ లాంటి వారందరి అభిప్రాయాలు ఢిల్లీ పెద్దలు సేకరించారు. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పిలిచిన అధిష్టానం తన మనసులో మాట ని తెలుసుకుంది. దీంతో వివాదాలకు దూరంగా ఉండే జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పిలవడం తో పీసీసీ రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైనట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డిని అధిష్ఠానం ఖరారు చేసినట్లే. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ ముగ్గురిలో ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో జీవన్ రెడ్డి పేరు తెరపైకి రావడం గమనార్హం.
ప్రచార కమిటీ ఇస్తే తీసుకోవడానికి సిద్ధం : రేవంత్ రెడ్డి
పీసీసీ చీఫ్ ఎంపిక అంశం పై ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ 165 మంది నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు. అధిష్టానానికి నివేదిక అందించారు. అనంతరం కొద్ది రోజులకు టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్‌కు ఖరారైందని వార్తలు వచ్చాయి. దీనిపై సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆయన విమర్శించారు. ప్యాకేజీకి అమ్ముడు పోయారని ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. అది అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే అధిష్ఠానం జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్టీలో అందరితోనూ మంచి సంబంధాలున్న జీవన్ రెడ్డి అయితే ఏ ఇబ్బందీ ఉండదని అధిష్ఠానం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రచార కమిటీ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అది ప్రజలకు మరింత దగ్గర చేసే పదవని రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు కూడా టీపీసీసీ చీఫ్ కథ కొలిక్కి వచ్చిందని తెలియజేస్తున్నాయి.
సాఫీగా సాగేలా మరిన్ని పదవులు
ప్రస్తుతం పార్టీలో రేగుతున్న కల్లోలం నేపథ్యంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సాఫీగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో దామోదర రాజనర్సింహ, వీహెచ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డిలను కూడా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మర్రి శశిదర్ రెడ్డిలకు కూడా కీలక పదవులు అప్పగించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరికి ఏఐసీసీ పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీగౌడ్, సంపత్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.