iDreamPost
android-app
ios-app

ఈటల దారెటు..?

ఈటల దారెటు..?

అసైన్మెంట్‌ భూముల కొనుగోలు, కబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ రాజకీయ పయనం ఎలా సాగబోతోంది..? టీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటూ.. వివిధ పార్టీలు, సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తూ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ ఎలా సాగబోతోంది..? ఆయన సొంతంగా పార్టీ పెడతారా..? లేదా ఏదో ఒక జాతీయ పార్టీలో చేరతారా..? అనే అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

ఆది నుంచి ఉన్న నేత..

టీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈటల రాజేందర్‌ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో చురుకుగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలోనూ, తెలంగాణ ప్రభుత్వంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈటల సంపాదించుకున్నారు. ఈటలను తన సోదరుడుగా కేసీఆర్‌ భావించారు. అయితే రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత.. కేసీఆర్‌కు, ఈటలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చినట్లు పలు సందర్భాల్లో ఈటల చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది.

మంత్రి పదవికి ఎసరు..

టీఆర్‌ఎస్‌పార్టీలో తాము కిరాయిదారుల కాదని, ఓనర్లమంటూ ఈటల చేసిన వ్యాఖ్యల తర్వాత కొద్ది రోజులకే ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడం, వాటిపై విచారణ చేయాలంటూ కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడం. శాఖ లేని మంత్రిగా చేయడం, ఆ తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం చకచకగా జరిగిపోయాయి. భూ కబ్జా ఆరోపణలపై న్యాయపోరాటం మొదలుపెట్టిన ఈటలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సరైన విధంగా సర్వే చేయకుండా.. నివేదిక ఎలా ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్నిస్తూ.. మళ్లీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ఈటలకు కొండంత బలం చేకూరింది. ఈ ఊపులోనే ఆయన తన రాజకీయ వేగాన్ని పెంచారు.

Also Read : రేవంత్ మంత్రాంగం : ఈటల కాంగ్రెస్ లోకి వెళ్తారా..?

అన్ని వైపుల నుంచి ఆహ్వానం..

కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఈటలకు ఆహ్వానం అదిందన్న ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా ఆఫర్‌ వచ్చిందనే వార్తలు వెలువడ్డాయి. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో ఈటల మాట్లాడారని వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఈటల సొంతంగా పార్టీ పెడతారని, బీసీలను ఏకం చేస్తారంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు.

టార్గెట్‌ ఈటల..

ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా కూడా అనర్హుడిగా చేసి.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఆయన్ను ఓడించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన హరీష్‌రావు హుజురాబాద్‌పై దృష్టి సారించారు. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత కూడా కే సీఆర్‌.. ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈటల తనయుడు భూమిని ఆక్రమించారనే ఫిర్యాదుపై నేరుగా కేసీఆరే స్పందించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం తర్వాత.. ఈటల వ్యవహారంలో కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని, భవిష్యత్‌లోనూ ఈటలతో రాజకీయ వైరం కొనసాగుతుందనే సంకేతాలు వెలువడ్డాయి.

కేసీఆర్‌తో ఢీ కొట్టేందుకు సై..

కేసీఆర్‌తో ఢీ కొట్టేందుకే ఈటల సిద్ధమయ్యారని ఆయన చర్యల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆయన సొంతంగా పార్టీ పెడితే.. బలవంతుడైన కే సీఆర్‌ను తట్టుకోగలరా..? పార్టీని నడిపించాలంటే ఆర్థికంగా ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆర్థికంగా ఈటల బలవంతుడైనా.. ఆయన బలాన్ని దెబ్బకొట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని అధికారంలో ఉన్న కేసీఆర్‌ వదులుకోకపోవచ్చు.

మద్ధతు అవసరం…

ఒక కులం ఆధారంగా పార్టీ పెడితే.. విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న తర్వాత.. ఈటల రాజేందర్‌ సొంతంగా పార్టీ పెట్టే ఆలోచణ చేయకపోవచ్చు. కేసీఆర్‌ ఈటలను లక్ష్యంగా చేసుకున్న తరుణంలో.. ఆయనకు కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల మద్ధతు అవసరం. కాబట్టి ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌ లేదా బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు. ఈటల పయనం ఎలా సాగుతుందనేది ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల వచ్చే హుజురాబాద్‌ ఉప ఎన్నికల ద్వారా తెలుస్తుంది. ఉప ఎన్నిక జరిగితే.. ఆయన సొంతంగా పోటీ చేస్తారా..? లేదా కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తారా..? అనేది తేలిపోతుంది.

Also Read : ఈట‌ల‌ను ఎమ్మెల్యే గా కూడా తీసేస్తారా..?