బీజేపీ జనసేన పొత్తు వికటించబోతోందా..?

వ్యాపారం అయినా, రాజకీయం అయినా ఇద్దరి మధ్య పొత్తు కుదరాలంటే వారి మధ్య అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం ఉండాలి. అప్పుడే వ్యాపారమైనా, రాజకీయమైనా సరైన దిశలో సాగి లక్ష్యం చేరుకుంటుంది. పొత్తు పెట్టుకుని భిన్న విధానాలు అవలంభిస్తే.. అది మధ్యలోనే వికటిస్తుంది. లేదా లక్ష్యం చేరుకోవడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీ–జనసేనలు భిన్న విధానాలను అవలంభిస్తున్నాయి.

రాజధాని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. అమరావతి ఒక వైపు, మూడు ప్రాంతాల్లో అమరావతితో కూడిన మూడు రాజధానులు ఒక వైపుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి మొదలైన మూడు రాజధానుల వ్యవహారం శాసన ప్రక్రియ కూడా ముగించుకుని ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తోంది. ఒకట్రెండు నెలల్లో మూడు రాజధానులు కార్యరూపం దాల్చడంపై క్లారిటీ వస్తుంది.

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని పార్టీలు రాజధానిపై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే దాఖలు చేసింది. జనసేన ఆ పనిలో ఉంది. తాము అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతున్నామని జనసేన అధినేత ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ మాత్రం మూడు ప్రాంతాల సమానాభివృద్ధితో కూడిన సమృద్‌ ఆంధ్రా లక్ష్యమని ప్రకటించింది. ఈ నినాదంతోనే ఇకపై ఏపీలో రాజకీయాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

రాజధాని అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఈ విషయంలో పొత్తు రాజకీయాలు చేస్తున్న బీజేపీ, జనసేనలు మాత్రం భిన్నంగా నడుస్తుండడం గమనార్హం. కలిసి కార్యక్రమాలు చేయడం వరకూ ఏ ఇబ్బంది ఉండదు. రేపు ఎన్నికలకు వెళ్లే సమయంలో తమ విధానంపై ఇరు పార్టీలు ఏమని ప్రజలకు చెబుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని బీజేపీ ప్రకటించింది. రాయలసీమలోని ముఖ్యమైన కేంద్రంలో జరగబోయే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా.. రాజధాని విషయంపై తమ వైఖరిని చెప్పాల్సి వస్తుంది. ఒక వేళ పార్టీలు మౌనంగా ఉన్నా.. ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. మరి రాజధానిపై భిన్న విధానాలతో ఉన్న బీజేపీ, జనసేనలు తమ వైఖరిపై ఏమని ప్రజలకు చెబుతాయి..?

భిన్న వైఖరులతో ఉన్న బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఎంత వరకు కొనసాగుతుందో చెప్పలేం. జనసేనతో కలసి పోటీ చేస్తాం, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం,.. అంటూ పలుమార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. కానీ జనసేన నుంచి మాత్రం ఆ మాట రాకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇతరుల భుజాలపై చేతులు వేసి రాజకీయం చేసే విధానాల నుంచి బయటకు రావాలన్న బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌ మాటను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెవికి ఎక్కించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.

Show comments