iDreamPost
iDreamPost
ఏపీలో బీజేపీ, జనసేన మితృత్వం పేరుకి మాత్రమే మిగిలింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే టీడీపీతో జనసేన జతగట్టింది. పైగా తనకు ఎక్కువ ఎంపీటీసీ స్థానాలున్నప్పటికీ ఎంపీపీ పీఠం మాత్రం టీడీపీకే కట్టబెట్టడం ద్వారా త్యాగాలకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో జనసేన బ్రేకప్ చేసుకోవడం ఖాయమయ్యింది. కానీ దానికి ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే నెలలోనే జనసేన అధినేత తన మనసులో మాట బయటపెట్టబోతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. బీజేపీని వీడి టీడీపీ గూటిలో చేరడానికి ఆయన సన్నద్దమవుతున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో యూపీ ఎన్నికల వరకూ వేచి చూసే ధోరణిలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది.
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఇప్పుడు బీజేపీ నేతలు కనీసం దర్శనభాగ్యం కూడా కల్పించకుండా ఆయన్ని దూరం పెట్టేయడానికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తాము మద్ధతు ఇస్తున్నట్టు మహానాడులో తీర్మానం చేసినా అది కూడా వన్ సైడ్ లవ్ అన్నట్టుగా మిగిలిపోయింది. టీడీపీ నేతల ఆరాటమే తప్ప బీజేపీ నుంచి ఎటువంటి స్పందన కరువయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో ఉన్న జనసేనను తనవైపు తిప్పుకుంటే అది బీజేపీ పెద్దలకు ఆగ్రహాన్ని కలిగిస్తుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీకి దాదాపుగా దూరమయినప్పటికీ ప్రత్యక్షంగా టీడీపీతో జనసేన పొత్తుకి అధికార ముద్ర వేయకపోవడానికి అదొక్కటే కారణంగా అనుమానిస్తున్నారు.
Also Read : క్యాబినెట్ లో భారీ మార్పులు.. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్న సీనియర్ మంత్రి
మరోవైపు బీజేపీకి జనసేన చాలాకాలం క్రితమే దూరమయ్యింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. అరకొర ప్రచారంతో సరిపెట్టడం బీజేపీ నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా బీజేపీతో కలిసి సందర్భాలే లేవు. ఇటీవల తమ పార్టీ తరుపున ఒంటరిగానే వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో రోడ్ల సమస్య మీద నిర్వహించే కార్యక్రమం కూడా ఒంటరిగానే చేపట్టాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా జనసేనను తమ మిత్రపక్షంగా చూడడం లేదు. దాంతో బీజేపీని వీడి టీడీపీతో జనసేన కలిసిపోతుందనే ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే పరిషత్ ఎన్నికల వ్యవహారంలో టీడీపీ కోసం ఇప్పటికే జనసేన అనేక చోట్ల బహిరంగంగానే త్యాగాలు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, వీరవాసరం ఎంపీపీ పీఠాలను టీడీపీ కైవసం చేసుకోవడంలో జనసేనదే ముఖ్యపాత్ర. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కడియం, రాజోలు, మలికిపురం ఎంపీపీ పీఠాల్లో కూడా టీడీపీకి జనసేన అండగా నిలిచింది. కడియంలో అయితే జనసేనకు మెజార్టీ ఉన్నప్పటికీ వైస్ ఎంపీపీతో సరిపెట్టుకుని టీడీపీకి పీఠం అప్పగించేందుకుంది. మరికొన్ని చోట్ల కూడా టీడీపీకి మద్ధతునిచ్చినా జనసేన లక్ష్యం మాత్రం నెరవేరకుండా అధికార పార్టీ అడ్డుకట్ట వేయగలిగింది. ఈ నేపథ్యంలో క్షేత్రంలో కూడా కలిసిపోయిన టీడీపీ, జనసేన పొత్తుకి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.
Also Read : ఎన్నిక ఏదైనా.. మెగా బద్రర్స్‌కు కలసిరాని సొంతూరు
జనసేన ఈ విషయంలో ఆతృతపడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ యూపీ ఎన్నికల ఫలితాలు వచ్చేటంత వరకూ ఓపిక పట్టే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. యూపీలో యోగీ సర్కారు ఢీలా పడితే చంద్రబాబు గతంలో మాదిరి మళ్లీ తెరమీదకు వచ్చి అంతా తానే చేస్తున్నట్టు చెప్పుకునే యత్నం ప్రారంభించే అవకాశం ఉంది. దానికి భిన్నంగా మళ్లీ బీజేపీ యూపీ పీఠాన్ని నిలబెట్టుకుంటే మాత్రం బాబు బీజేపీకి మరింత దగ్గరయ్యే దిశలో అడుగులు వేయడం అనివార్యంగా కనిపిస్తోంది.