iDreamPost
android-app
ios-app

రత్నప్రభ నిజాలు దాచారా..?

రత్నప్రభ నిజాలు దాచారా..?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఐఎఎస్‌ అధికారి రత్న ప్రభ తనకు సంబంధించిన నిజాలు దాచారా..? నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పొందుపరచలేదా..? తాజాగా రిటర్నింగ్‌ అధికారికి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

రత్న ప్రభ తన నామినేషన్‌ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని పేర్కొన్నారు. అయితే ఆమెపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ విషయాన్ని ఆమె దాచారంటూ జనతాదళ్‌(యు) నేత ఏవీ రమణ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్‌ స్టేషన్లలో రత్న ప్రభపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏవీ రమణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఐదు కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చారు. కుల దృవీకరణ పత్రాలు కూడా అందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుల వివరాలు దాచిన రత్న ప్రభ నామినేషన్‌ను నిబంధనల ప్రకారం తిరస్కరించాలని ఏవీ రమణ రిటర్నింగ్‌ అధికారిని కోరారు.

తాజా పరిణామాలతో బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ చర్చోపచర్చల తర్వాత బలమైన అభ్యర్థి అంటూ మాజీ ఐఏఎస్‌ అధికారి రత్నప్రభను రంగంలోకి దించింది. నోటిఫికేషన్‌ రాక ముందు నుంచే తిరుపతిపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మిత్రపక్షం జనసేనను ఒప్పించి పోటీ చేస్తున్న బీజేపీని తాజా పరిణామం ఓ కింత ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ రోజు నామినేషన్‌ పత్రాల పరిశీలన జరుగుతోంది. సక్రమంగా ఉన్న వాటిని స్వీకరిస్తారు. వచ్చే నెల 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించనున్నారు. ప్రధాన పార్టీలతోపాటు మొత్తం 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల 17వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. ఐదు రాష్ట్రాల ఫలితాలతోపాటు మే 2వ తేదీన తిరుపతి ఫలితం కూడా వెల్లడవుతుంది.

Also Read : ఇవేం మాటలు అచ్చెన్నా..?