కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన మహిళకు సిజేరియన్ పేరుతో ఆపరేషన్ చేసి శిశువు మొండాన్ని మాత్రం బయటకు తీశారు వైద్యులు. తలని మాత్రం తల్లి గర్భంలోనే వదిలేశారు. ఈ నిర్లక్ష్య సంఘటన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మిడుతూరి మండలం అలగనూరు గ్రామానికి చెందిన లక్ష్మీ దేవికి పురిటినొప్పులు రావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. సాధారణ డెలివరీ చేస్తాం భయపడకండి అని కుటుంబసభ్యులకు చెప్పిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని సిజేరియన్ చేయక తప్పదని కుటుంబసభ్యులకు వివరించారు. మళ్ళీ మాట మార్చిన వైద్యులు మత్తు మందు ఇచ్చే వైద్యుడు రాలేదని చెప్పారు. మొత్తానికి సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు గర్భంలోనుండి శిశువు మొండాన్ని మాత్రం బయటకు తీసి తలను తల్లి గర్భంలో వదిలేశారు.
దీంతో తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. భయపడిన వైద్యులు వెంటనే లక్ష్మీదేవిని కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ తల్లి గర్భం నుండి తలను వేరు చేయడంతో లక్ష్మిదేవి ప్రాణాలు దక్కాయి.
కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మృతి చెందిందని లక్ష్మీ దేవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి ప్రజా సంఘాల మద్దతు తెలిపి ఈ సంఘటనపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వైద్యం చేసి శిశువు ప్రాణాలు తీయడంతో పాటు తల్లిని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేలా చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
నెలలు నిండకుండానే కాన్పుకు రావడం వల్ల శిశువు గర్భంలోనే ఎదురుకాళ్ళతో అడ్డం తిరగడం వల్ల మరణించాడని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు లక్ష్మిదేవి కుటుంబ సభ్యులు.
లక్ష్మిదేవికి ఇంతకుముందు కూడా గర్భస్రావం కావడం, రెండోసారి కాన్పులో వైద్యుల నిర్లక్ష్య ఫలితంగా శిశువును కోల్పోవడంతో మానసికంగా కృంగిపోయింది. ఇప్పటివరకు వైద్య చరిత్రలో ఇలాంటి నిర్లక్ష్య సంఘటన జరగలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.