iDreamPost
android-app
ios-app

దేవిని ట్రోల్ చేయకండి

దేవిని ట్రోల్ చేయకండి

టివి9 లో రుధిరానికేమైంది అని యాంక‌ర్ దేవిని చూశాను. ఆమె తెలివైంది. భాష తెలిసిన అమ్మాయి. కానీ స్క్రిప్ట్ రాసిన వాడి తెలివిని న‌మ్మి ఇరుక్కుంది. గ‌తంలో కూడా ఎన్నో జ‌రిగి వుంటాయి. కాక‌పోతే ఇపుడు సోష‌ల్ మీడియా అల‌ర్ట్‌గా వుంది కాబ‌ట్టి దొరికిపోయింది. నాలుగు రోజులు ట్రోలింగ్ మామూలే. భాషాభిమానులు బాధ‌తో కామెంట్స్ చేస్తున్నారు. న్యాయ‌మే. ఈ రుధిరానికి కార‌ణమేంటి? లోతుగా వెళితే ప‌త్రికా యాజ‌మాన్యాలు, చాన‌ల్ యాజ‌మాన్యాల దురాశ‌, జ‌ర్న‌లిస్టుల‌పైన చుల‌క‌న భావం,  త‌క్కువ జీతాలిచ్చి ప‌నులు చేయించుకోవాల‌ని చూడ‌డం, ఇట్లా చాలా వుంటాయి!

కొత్త‌గా జ‌రిగిందేమీ లేదు, పాత‌దే. భాష‌కి క‌త్తిపోట్లు త‌గిలి చాలా కాల‌మైంది. (భాష అంటే మ‌నిషి అనుకుని ఆత్మ‌శాంతి, నివాళి అని కామెంట్స్ పెడితే అది భాష ఖ‌ర్మ‌)

1987లో ఆంధ్ర‌భూమి స‌బ్ ఎడిట‌ర్ల కోసం విజ‌య‌వాడ‌లో టెస్ట్ జ‌రిగితే వంద‌ల మంది వ‌చ్చారు. తిరుప‌తిలో ఆంధ్ర‌జ్యోతి టెస్ట్ జ‌రిగితే తిరుప‌తి ఏరియా హైస్కూల్ నిండిపోయింది. 1986లో ఆంధ్ర‌ప్ర‌భ టెస్ట్ పెడితే వంద‌ల్లో వ‌చ్చారు. ఈ ప‌త్రిక‌ల‌కే ఇంత డిమాండ్ వుంటే ఈనాడుకి ఎంత మంది అప్లై చేసేవాళ్లో, ఎంద‌రు టెస్ట్ రాసేవాళ్లో ఒక‌సారి ఊహించుకోండి.

ఎందుకీ డిమాండ్ అంటే , 1990లో బ‌చావ‌త్ వేజ్‌బోర్డు అమ‌లు చేసే నాటికి సాధార‌ణ స‌బ్ ఎడిట‌ర్ జీతం 2500. అదే స‌మ‌యంలో విద్యుత్‌శాఖ‌లో ఒక క్ల‌ర్క్ జీతం 2వేలు, రెవెన్యూలో 1800. ముఫ్పై ఏళ్ల త‌ర్వాత 2020 నాటికి వాళ్ల జీతం ల‌క్ష‌న్న‌ర దాటితే , అత్యంత ప్ర‌తిభావంతుడైన స‌బ్ ఎడిట‌ర్ సీనియ‌ర్ న్యూస్ ఎడిట‌ర్ స్థాయికి ప్ర‌మోట్‌ అయితే అత‌ని జీతం అతిక‌ష్టంపై 50 నుంచి 70 వేలు. ఈ మాత్రం ప్ర‌మోష‌న్ అంద‌రికీ రాదు. పాతిక మందిలో ఒక‌డికి వ‌స్తుంది. అది కూడా కేవ‌లం ప్ర‌తిభ‌తో రాదు. గ‌త జ‌న్మ‌లో నువ్వు ప‌ట్టుపురుగై వుండాలి.

Also Read : వినాయక చవితి ఉత్సవాలు.. ప్రభుత్వ చర్యలను సమర్థించిన హైకోర్టు

వేజ్‌ బోర్డులు త‌ప్పించుకోడానికి బినామీ సంస్థ‌లు ఏర్పాటు చేసి , జ‌ర్న‌లిస్టుల‌కి అణా , అర్ధ‌ణా ఇవ్వ‌డం స్టార్ట్ అయ్యిందో అప్ప‌టి నుంచే స‌బ్ స్టాండ‌ర్డ్‌ మొద‌లైంది. కాక‌పోతే జ‌ర్న‌లిస్టు ప‌దానికి క్రేజ్ వుండ‌డం, అధికారులు, నాయ‌కుల ప‌రిచ‌యాల‌తో ప‌నులు చేయించుకునే ఆశ‌తో కొంద‌రు, ఏదో ఒక ఉద్యోగం అనుకుని కొంద‌రు ఇలా ఈ రంగంలోకి వ‌చ్చేవాళ్లు వ‌స్తూనే వున్నారు. వీళ్ల‌లో 80 శాతం మందికి సాహిత్యంపైన‌, తెలుగు భాష‌పైన ఎలాంటి మ‌మ‌కారం లేదు. రాయ‌డం కొంత వ‌చ్చు, కానీ క‌రెక్ట్‌గా ఏం రాయాలో తెలియ‌దు. బాపు ర‌మ‌ణ‌లు ఒకే వ్య‌క్తి అనుకున్న మ‌హానుభావులున్నారు. రెడ్‌హ్యాండెడ్ అంటే ఎర్ర చేతుల‌తో అని అనువాదం చేసిన వాళ్లూ వున్నారు.

తెలియ‌క‌పోవ‌డం త‌ప్పు కాదు. తెలుసుకోవాల‌నే కోరిక కూడా లేదు, ప్ర‌తిభ‌ని మెరుగుప‌రిచే మిష‌తో , త‌క్కువ స్టైఫండ్‌, ట్రైనీగా తక్కువ జీతాలు ఇచ్చే ఆలోచనతో  ఎవ‌రికి వాళ్లు జ‌ర్న‌లిజం స్కూళ్లు పెట్టుకున్నారు.

మానవ హ‌క్కులు, కార్మిక చ‌ట్టాల‌పై పేజీల కొద్దీ ఎడిటోరియ‌ల్స్ , వ్యాసాలు రాసే ప‌త్రిక‌లో అవేవీ వుండ‌వు. జ‌ర్న‌లిస్టుల‌కి రూల్ ప్ర‌కారం 6 గంట‌లు ప‌ని. 9 నుంచి 12 గంట‌లు చేయించే వాళ్లున్నారు. 

ప‌త్రిక‌లు లాభ‌సాటిగా లేవు, ఇదో స్టాక్ డైలాగ్‌. లాభాల్లో వున్న‌ప్పుడు కూడా పెద్ద‌గా ఇచ్చిందేమీ లేదు. అది వేరే విష‌యం.

ఒక వేరుశ‌న‌గ మిల్లు వుంద‌నుకున్నాం. నూనె వ్యాపారాన్ని లెక్క‌ల్లో చూపించ‌కుండా కేవ‌లం గానుగ చెక్క గురించి మాట్లాడితే అది న‌ష్టాల్లో వుంద‌నే అర్థం.

Also Read : సూపర్ పోలీస్ అవ్వాలని ఏకంగా అంబానీకే స్కెచ్ వేసాడు…

ఒక ఆవు వుంది. దాని పాలు, పెరుగు, వెన్న , నెయ్యి , జున్ను అన్నీ ప్యాకెట్ల‌లో అమ్ముకుని తిని , ప‌శువుల‌ కాప‌రికి కేవ‌లం పేడ చూపించి, పిడక‌ల్లో లాభాలు రావ‌డం లేద‌ని అంటే అది న్యాయం అవుతుందా?

ప‌త్రిక వుంది కాబ‌ట్టే ఎస్టేట్లు, సంస్థానాలు , ప‌దుల కొద్దీ వ్యాపారాలు. ప‌త్రిక‌ల మీద‌ బ‌తికి వేల‌కోట్ల‌కి చేరుకున్నారు. చాన‌ల్ వుంది కాబ‌ట్టే సొంత ప్ర‌యోజ‌నాలు తీరుతున్నాయి. అవ‌న్నీ ఎవ‌రూ మాట్లాడ‌రు.

ఒక వైపు సొసైటీలో ఇంగ్లీష్ మీడియం ప్ర‌భావంతో మంచి తెలుగు రాసేవాళ్లు త‌గ్గిపోయారు. మంచి తెలుగు రాసేవాడుంటే దేవి రుధిరం అని ప‌లికేది కాదు. ఇక చిన్న వూళ్ల‌లో వున్న కాంట్రిబ్యూట‌ర్ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ రోజుల్లో కూడా 2 వేల రూపాయ‌ల కంటే త‌క్కువ వేత‌నంతో చేస్తున్న వాళ్లున్నారు. రిపోర్ట‌ర్‌కి ఏ గౌర‌వ‌మూ ఇవ్వ‌ని ప‌త్రిక‌లు , చాన‌ళ్లు గౌర‌వ వేత‌నం ఇస్తారు (కొంద‌రు అది కూడా ఇవ్వ‌రు. ప‌త్రిక‌, చాన‌ల్ పేరు చెప్పి జ‌నం మీద ప‌డాలి. దాంట్లో కూడా యాడ్స్ రూపంలో సంస్థ‌కివ్వాలి).

త‌మ వ్యాపారాల‌కి తెలుగు భాష అత్య‌వ‌స‌రం అని తెలిసి కూడా జ‌ర్న‌లిస్టుల‌కి వేత‌నాల‌కి బ‌దులు చిల్లర విదిలిస్తున్న ద‌శ‌లో భాష‌పై ప‌ట్టున్న వాళ్లు ఎక్క‌డ దొరుకుతారు. బూతులు మాట్లాడే వాళ్లే దొరుకుతారు. అదే భ‌విష్య‌త్తు.

ద‌య‌చేసి దేవిని ట్రోల్ చేయ‌కండి. రోగం ఎక్క‌డో వుంటే , మందు ఇంకో చోట వేస్తే ఏం లాభం?

Also Read : ఆయన పాలన కమ్యూనిస్టులకూ ఇష్టం