iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే తల్లి ఇందిరా దేవి మరణంతో డిస్ట్రబ్ అయిన ప్రిన్స్ సేదతీరడం కోసం స్పెయిన్ కు వెళ్ళిపోయాడు. అయితే ఈసారి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా బయలుదేరాడు. ఏవో ఆరోగ్య కారణాలన్నారు కానీ అవి నిజం కాదట. ఇన్ సైడ్ టాక్ కేవలం రిలాక్స్ కావడానికి మాత్రమే ఈ ట్రిప్ పెట్టుకున్నట్టు తెలిసింది. షూటింగ్ మొదలయ్యాక కూడా స్క్రిప్ట్ విషయంలో పలు సందేహాలు తలెత్తాయని, త్రివిక్రమ్ ప్రస్తుతం వాటి మీదే వర్క్ చేస్తున్నారనే ప్రచారం ఉంది కానీ నిజమెంతో తెలియదు. అయోధ్యలో అర్జునుడు టైటిల్ ని పరిశీలనలో ఉంచారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు పెట్టుకున్న రిలీజ్ డేట్ టార్గెట్ ఏప్రిల్ 28ని అందుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే చేతిలో ఉన్న నాలుగు నెలల సమయంలో టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసి ఆపై ప్రమోషన్లు, పబ్లిసిటీ వగైరాలు చూసుకోవాలి. ఆ లెక్కలో ఇది చాలా తక్కువ టైం. పోకిరి, బాహుబలి 2, అడవి రాముడు, యమలీల లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్లకు అచ్చి వచ్చిన తేదీ అది. అందుకే ఫ్యాన్స్ చాలా సెంటిమెంట్ గా కూడా ఫీలయ్యారు. తీరా చూస్తే ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో ఖచ్చితంగా కట్టుబడలేకపోవచ్చు. మరోవైపు ఇతర ఆర్టిస్టుల డేట్లను కూడా రిలీవ్ చేయడం గమనార్హం.
ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తనేమో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ షూటింగ్ లో బిజీగా ఉంది. డిసెంబర్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో యూనిట్ ఉరుకులు పరుగుల మీద చిత్రీకరణ చేస్తోంది. వెంకటేష్ కూడా ఈ షూట్ లోనే ఉన్నారు. సో పూజా ఫ్రీ అవ్వాలంటే ఇది ఫినిష్ కావాలి. సెకండ్ హీరోయిన్ సంగతి కూడా ఇంకా తేలాల్సి ఉంది. యాక్షన్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియాగా ప్రమోట్ చేయడం లేదు. కేవలం తెలుగు వెర్షన్ కే కట్టుబడుతున్నారు. ఈ లెక్కన ఏప్రిల్ 28 టార్గెట్ ని దాదాపు మిస్ చేసుకున్నట్టే. అదే జరిగితే దసరాకు షిఫ్ట్ అవ్వడం తప్ప ఆప్షన్ ఉండదు