iDreamPost
android-app
ios-app

Tamil Nadu: డీఎంకే ఎమ్మెల్యే విందు వేడుకలో చదివింపులు పది కోట్లు!

Tamil Nadu: డీఎంకే ఎమ్మెల్యే విందు వేడుకలో చదివింపులు పది కోట్లు!

ఇంట్లో కష్టమొచ్చినప్పుడల్లా ఫంక్షన్ చేసి ఆ వచ్చిన చదివింపులు లేదా ఈడులతో గండాన్ని గట్టెక్కించుకున్న ఒక ఆడపడుచును మనం “జయమ్మ పంచాయతీ” సినిమాలో చూశాం. కానీ తమిళనాడులోని తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లో నిజంగానే ఇలాంటి ఆచారమొకటి వందేళ్ళ నుంచి ఉంది. దీన్ని తమిళంలో “మోయి విరుంతు” అంటారు. ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది తలెత్తితే విందు ఏర్పాటు చేసి ఆ వచ్చిన చదివింపులను ఖర్చులకు వాడుకుంటారు. డబ్బు కష్టాల్లో ఉన్న బంధువులకు చేయూతనిచ్చేందుకు అప్పట్లో ఈ ఆచారాన్ని ప్రారంభించారు. అయితే అదేపనిగా ఇలాంటి ఫంక్షన్స్ జరపడానికి వీల్లేదు. ఒకసారి విందు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఐదేళ్ళ తర్వాతే మరో వేడుకకు అనుమతి ఉంటుంది.
ఇలాంటి ఒక వేడుకే పేరావూరణి నియోజకవర్గ MLA, DMK నేత అయిన అశోక్ కుమార్ ఇంట్లో ఇటీవల జరిగింది. ఆయన మనవ సంతానం చెవులు కుట్టే వేడుక, చదివింపుల విందు ఒకేసారి ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో వచ్చిన చదివింపుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10 కోట్ల రూపాయలు. విందులో ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్లుగానే చేశారు. 15 వేల మంది అతిథులకు 500 మంది వంటగాళ్ళు 15 వందల కేజీల మటన్ వండి వడ్డించారు. ఇక చదివింపులు సమర్పించే వారి కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ డబ్బులు వసూలు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీసీటీవీల్లో రికార్డు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పహరా కాశారు. విందు జరిగిన సాయంత్రం కౌంటింగ్ మెషీన్లతో లెక్కింపు మొదలెట్టిన బ్యాంకు సిబ్బంది తెల్లారే దాకా నాన్ స్టాప్ గా పని చేస్తే గానీ లెక్క తేలలేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ విందులు, వేడుకలకు తోచినంత చదివించే ఆచారముంది కానీ చదివింపుల కోసమే ఇలా విందులు ఏర్పాటు చేయడం అరుదే!