Idream media
Idream media
మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తాజాగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం పక్కాగా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి మార్గదర్శనం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేకకోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొనగా వారం రోజుల్లోగా డబ్బును డిపాజిట్ చేయాలని చెప్పారు. 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబుల్లో 176 పోస్టులను భర్తీకి జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్‌స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు.
ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ల (హింస, లైంగిక దాడులకు గురైన మహిళలను ఆదుకునేందుకు)ను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితోపాటు ఒక మహిళా ఎస్‌ఐని నియమించడానికి ఆమోదం తెలిపారు. సురక్ష స్పందన యాప్ తయారు చేశామని, మొత్తం 86 రకాల సేవలు అందుతాయని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని డీజీపీ వివరించారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్ చేయాలని, దీంతో పాటు దిశ యాప్ కూడా పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి సూచించారు.