iDreamPost
iDreamPost
కరోనా తర్వాత ఇటీవల వచ్చిన భారీ సినిమాలన్నిటికీ రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలు పెంచారు టాలీవుడ్ వర్గాలు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి స్టార్ హీరోల సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకునేలా చేశారు. అయితే ఇది RRR , KGF లాంటి సినిమాలకి వర్క్ అవుట్ అయింది కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలకి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆఖరికి డబ్బింగ్ సినిమాలకి కూడా రేట్లు పెంచడంతో చాలా వరకు మిడిల్, లోయర్ క్లాస్ ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళలేదు.
రేట్లు పెంచితే కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారు కానీ ఇలా ప్రేక్షకులు రాకుండా నష్టాలు వస్తాయని ఊహించలేదు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. దీంతో ఒకప్పుడు రేట్లు పెంచాలి అని అడిగిన అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు రేట్లు తగ్గించాలి అంటున్నారు. మే 27న దిల్ రాజు నిర్మించిన F3 సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇన్ని రోజులు టికెట్ రేట్లు పెంచడం వల్ల నష్టాలు రావడంతో ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచము అని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టికెట్ రేట్లపై మరోసారి మాట్లాడారు దిల్ రాజ్.
దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కరోనా వల్ల సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు కూడా పెరిగాయి. ఇదే సమయంలో ప్రేక్షకులు ఓటీటీకి దగ్గరయ్యారు. దీంతో థియేటర్ కి వచ్చేవారు తగ్గారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాము. కానీ ఇది అన్ని సినిమాలకి వర్తించదని తర్వాత అర్థమైంది.
టికెట్ రేట్లు పెంచడం వల్ల చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమయ్యారు, రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే ఆలోచిస్తున్నారు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, F3 సినిమా ఫ్యామిలీ సినిమా కాబట్టి అన్ని ఫ్యామిలీలు సరదాగా థియేటర్ కి వచ్చి సినిమా చూడాలని భావించి ఈ సినిమాకి టికెట్ రేట్లను పెంచడం లేదు. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ కచ్చితంగా వస్తారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి అని తెలిపారు