iDreamPost
iDreamPost
ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ కు, అల్లూరి సీతారామరాజు ఇంట్రో వీడియోకు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కరోనా భయంలో ఇది బోలెడంత రిలీఫ్ గా అనిపించిందని అభిమానులు సంతోషించారు. ముఖ్యంగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అద్భుతంగా కుదరడంతో వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి. చరణ్ బర్త్ డే గిఫ్ట్ అదిరిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి మే 20 మీదకు వెళ్తోంది. అది యంగ్ టైగర్ పుట్టిన రోజు. కాబట్టి ఆ రోజు చరణ్ గొంతులో కొమరం భీంగా తారక్ ఇంట్రో వీడియో వస్తుందని సహజంగానే అంచనాలు మొదలయ్యాయి.
అయితే అందరిలా ఆలోచిస్తే రాజమౌళికి మిగిలినవాళ్లకు తేడా ఏముంది. ఇక్కడే జక్కన్న చాలా డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొమరం భీం ని రామరాజులా కాకుండా స్ట్రెయిట్ గా చరణ్ ద్వారానే నేరుగా పరిచయం చేయించి ఇద్దరినీ ఒక ఫ్రేమ్ లో చూపించేలా చాలా స్పెషల్ గా ప్రమోషన్ ని ప్లాన్ చేశారట. అంటే చరణ్ కూడా కొమరం భీం వీడియోలో కనిపిస్తాడన్న మాట. ఇది అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కాకపోయినా ప్లానింగ్ ఇదే తరహాలో జరుగుతున్నట్టు సమాచారం. ఎలాగూ ఆ సమయానికి కోవిడ్ 19 తాలూకు సెగలు తగ్గిపోయి జనాలు తిరిగి సినిమా మూడ్ లోకి వచ్చి ఉంటారు కాబట్టి చాలా స్పెషల్ గా కొమరం భీంని పరిచయం చేయాలనే ఆలోచన ఉందట రాజమౌళికి. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారట.
ఎలాగూ లాక్ డౌన్ పూర్తయ్యాక ఆఘమేఘాల మీద ఆర్ఆర్ఆర్ షూటింగ్ రెజ్యుమ్ చేయాల్సి ఉంటుంది. చాలా టైట్ షెడ్యూల్స్ లో ఆర్టిస్టుల డేట్లు దొరుకుతాయి. వీలైనంత వేగంగా పని కానివ్వాలి. అందులోనూ ఇంకా 30 శాతం దాకా షూటింగ్ బాలన్స్ ఉంది. ఆగష్టు లోపు ఫినిష్ చేసి ఆపై ఐదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు పూర్తి స్థాయి పబ్లిసిటీకి కేటాయించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 8 డెడ్ లైన్ మీట్ అయ్యేందుకు రాజమౌళి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలిసింది. ఎలాగూ అది ఖరారు అయ్యింది కాబట్టి ఆర్ఆర్ఆర్ తో డైరెక్ట్ క్లాష్ లేకుండా మిగిలిన హీరోలు తమ రిలీజుల ప్లానింగ్ చేసుకుంటున్నారు. సో ఇంకో 50 రోజుల్లో రాబోతున్న కొమరం భీం ఎలా ఉంటాడోనన్న ఆసక్తి అప్పుడే మొదలైపోయింది.