iDreamPost
android-app
ios-app

Somu veerraju – వికేంద్రీకరణకు సొమ్ములెందుకు సోము?

  • Published Nov 23, 2021 | 9:11 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Somu veerraju – వికేంద్రీకరణకు సొమ్ములెందుకు సోము?

పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద అసలు దానికోసం నిధులున్నాయా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన స్థాయిలో అమరావతిని నిర్మించడానికి నిధులు లేవని, అందుకే పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపుతున్నామని నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన విస్పష్టంగా ప్రకటన చేశాక కూడా సోము ఇలా వ్యాఖ్యలు చేయడమే వింత. విజయవాడ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ ప్రభుత్వాన్ని నడిపేందుకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బుల్లేవని.. అలాంటప్పుడు మీరేం చేయగలుగుతారని సోము వీర్రాజు నిలదీశారు.  ఈ విషయంలో ప్రజల్ని మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.

అర్థం కాలేదా?ప్రభుత్వం చెబుతున్నది

చంద్రబాబు ఊహల రాజధాని అమరావతిని 50 వేల ఎకరాల్లో నిర్మించడం ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్లో సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. 50 వేల ఎకరాల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాల కల్పనకే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, భవిష్యత్తులో ఇది అయిదారు లక్షల కోట్లకు చేరుతుందని సీఎం స్పష్టంగా చెప్పారు. ఇంత ఖర్చును భరించడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా వీలు కాదని వివరించారు. అందువల్లనే వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇంత వివరంగా ప్రభుత్వం చెబితే దానికి వ్యతిరేకంగా ఆలోచించి వికేంద్రీకరణకే ఎక్కువ ఖర్చు అవుతుందన్నట్టు సోము మాట్లాడడం చూస్తే ఆయనకు ప్రభుత్వం చెబుతున్నది అర్థం కాలేదా అన్న అనుమానం వస్తోంది.

Also Read : Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు పెద్దగా ఖర్చు కాదని ప్రభుత్వం చెబుతుంటే నిధులు ఎక్కడివి అని ప్రశ్నించడం ఏమిటి? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. బీజేపీ కోరుతున్నట్టే న్యాయ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేస్తుంటే వ్యతిరేకంగా మాట్లాడటం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోందని అధికార పక్షం చేసే విమర్శలకు సోము ఏమి సమాధానం చెబుతారు?

చిత్తశుద్ధి ఉంది కనుకే కొత్త బిల్లు

కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుందని ఈ విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదని సోము వీర్రాజు విమర్శించారు. అయితే పరిపాలనా వికేంద్రీకరణకు తాము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నామని, అందుకోసమే బిల్లును పకడ్బందీగా రూపొందించి శాసనసభలో ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతోంది. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడానికి బిల్లును ఉపసంహరించు కున్నారనడం హాస్యాస్పదం. రేపు ప్రభుత్వం కొత్త బిల్లు తెచ్చిన తరువాత కూడా అభ్యంతరం ఉన్నవారు కోర్టును ఆశ్రయించవచ్చు. ఎవరూ కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు అని బిల్లులో పొందుపర్చరు కదా?

సూచనలు ఇస్తే మంచిది.. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కనుక ఒక పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు అందుకు అనుగుణంగా బిల్లు రూపకల్పనకు సూచనలు ఇస్తే బాగుంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్పూర్తిని అర్థం చేసుకొని, తన పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి సహకరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. తద్వారా వారి మెప్పు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాని ప్రజాభీష్టం గుర్తించకుండా విమర్శలు చేస్తే బీజేపీకి వీసమెత్తు ఉపయోగం ఉండదు.

Also Read : 3 Capitals -టీడీపీ ఉక్కిరిబిక్కిరి, అధికార పార్టీ ఎత్తులతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం