iDreamPost
iDreamPost
సమాజంలో ప్రతిఒక్కరికి కోర్టులో న్యాయం దొరుకుతుందనుకోవడం కలలో కూడా జరగని పని. డబ్బు పలుకుబడి వ్యవస్థను శాశిస్తున్న రోజుల్లో దాన్ని ఆశించడం కూడా అత్యాశే. నిలువెల్లా ఆవేశం నిండి అదే ధర్మం కోసం కట్టుబడ్డ ఓ యువకుడు నల్లకోటు వేసుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన సినిమా ధర్మచక్రం. 1995లో ‘బాషా’ బ్లాక్ బస్టర్ అయ్యాక దర్శకుడు సురేష్ కృష్ణ కోసం ఎందరో నిర్మాతలు విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయమది. దాని తర్వాత మలయాళంలో చేసిన ది ప్రిన్స్, తమిళంలో చేసిన శివశక్తి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో మంచి కసి మీద ఉన్నారాయన. అప్పుడు వచ్చింది రామానాయుడు గారి నుంచి కబురు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అంటే సురేష్ కృష్ణకు అభిమానం. 1988లో ఒక సినిమానే చేసిన తనను నమ్మి వెంకటేష్ ‘ప్రేమ’ అవకాశం ఇచ్చింది నాయుడుగారే. అది సక్సెస్ అవ్వడమే కాకుండా నంది అవార్డులు కూడా సాధించింది. అదే సంస్థలో కమల్ హాసన్ తో తీసిన ‘ఇంద్రుడు చంద్రుడు’ కూడా పెద్ద హిట్టు. మళ్ళీ నాయుడుగారుతో చేసే ఛాన్స్ దొరకలేదు. అందుకే తనదగ్గరున్న ‘ధర్మచక్రం’ లైన్ ని సురేష్ బాబుకి వినిపిస్తే అది బ్రహ్మాండంగా నచ్చింది. 1991లో విడుదలైన ‘శత్రువు’లో వెంకటేష్ లాయర్ గా కనిపించేది కాసేపే. కానీ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. అదే ఫుల్ లెన్త్ తో చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ధర్మ చక్రం.
ఆ టైంలో వెంకీకి వరసగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సూపర్ పోలీస్, ముద్దుల ప్రియుడు, పోకిరిరాజా, తక్ దీర్ వాలా సక్సెస్ కాలేదు. అందుకే ధర్మచక్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం పరువుకు సరితూగరన్న కారణంతో ప్రేమించిన అమ్మాయి చావుకు కారణమైన తండ్రిని ఎదిరించే లాయర్ రాకేష్ కథే ఈ సినిమా. ఫ్లాష్ బ్యాక్ కోసం ప్రేమ, వర్తమానం కోసం రమ్యకృష్ణను హీరోయిన్లుగా తీసుకున్నారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మొదటిసారి స్టార్ హీరో ఇచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. 1996 జనవరి 13న విడుదలైన ధర్మచక్రం ఒక్కరోజు ముందు వచ్చిన ‘పెళ్ళిసందడి’ సునామీని తట్టుకుని మరీ హిట్టు కొట్టింది. వెంకటేష్ కు మరోసారి నంది పురస్కారాన్ని తెచ్చి పెట్టింది. అందుకే అభిమానుల హాట్ ఫెవరెట్స్ లో ఇదీ ఒకటిగా నిలిచింది.