iDreamPost
android-app
ios-app

మాస్ మహారాజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

  • Published Dec 24, 2022 | 12:17 PM Updated Updated Dec 24, 2022 | 12:17 PM
మాస్ మహారాజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సినీ ప్రయాణం ఒక హిట్, మూడు ప్లాప్ లు అన్నట్లుగా సాగుతోంది. గతేడాది ‘క్రాక్’తో ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించిన ఆయన.. ఈ ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఇక రవితేజ పనైపోయిందనే మాటలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం ‘ధమాకా’తో మంచి ఓపెనింగ్స్ రాబట్టి అందరికీ అదిరిపోయే సమాధానమిచ్చాడు.

రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. పక్కా కమర్షియల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 23న విడుదలైంది. విడుదలకు ముందే ఈ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ ని ఎవరు చూస్తారనే కామెంట్స్ వినిపించాయి. విడుదలయ్యాక కూడా అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది కానీ.. సినిమా మాత్రం పరం రొటీన్ అని రివ్యూలు వచ్చాయి. కానీ వాటన్నింటిని అధిగమించి ఫస్ట్ డే మాస్ మహారాజా భారీ కలెక్షన్స్ రాబట్టాడు.

రవితేజ గత చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో సినిమా సినిమాకి రవితేజ మార్కెట్ పడిపోతుందని, ‘ధమాకా’కి పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమనే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ యావరేజ్ టాక్ తోనే ఈ మూవీ మొదటి రోజు రూ.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.4.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ధమాకా.. వరల్డ్ వైడ్ గా రూ.5.10 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దాదాపు రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఇదే జోరు కొనసాగితే న్యూ ఇయర్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.