iDreamPost
android-app
ios-app

Devullu : పిల్లల కోసం దైవమే తోడొస్తే – Nostalgia

  • Published Nov 23, 2021 | 12:13 PM Updated Updated Nov 23, 2021 | 12:13 PM
Devullu : పిల్లల కోసం దైవమే తోడొస్తే – Nostalgia

మాములుగా భక్తి సినిమా అంటే ఒకే దేవుడిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఉదాహరణకు అన్నమయ్య, శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం, శ్రీ షిరిడిసాయిబాబా మహత్యం, శ్రీరామదాసు, కరుణించిన కనకదుర్గ ఇలా చెప్పుకుంటూ లిస్టు చాంతాడంత అవుతుంది. వీటిలో ఒక దైవం చుట్టూ మాత్రమే కథ తిరుగుతుంది. అలా కాకుండా అందరు దేవుళ్ళను హోల్ సేల్ గా ఒకే చిత్రంలో చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే కోడిరామకృష్ణ గారు తీసిన దేవుళ్ళకు శ్రీకారం చుట్టేలా చేసింది. అమ్మోరుతో మొదలుపెట్టి డివోషనల్ గ్రాఫిక్స్ అనే కొత్త విభాగాన్ని సృష్టించి తనదైన సంతకం చేసిన ఈ విలక్షణ దర్శకుడి సృష్టే ఈ ఆణిముత్యం

2000 సంవత్సరం. దానికి ముందు ఏడాది దేవి రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాక కోడి రామకృష్ణ గారికి ఏకంగా నాలుగు ఫ్లాపులు పలకరించాయి. కృష్ణ భారతరత్న, శ్రీకాంత్ పంచదార చిలక, నవీన్ వడ్డే మా బాలాజీ, రమ్యకృష్ణ ఆవిడే శ్యామల ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. స్టార్ కంటే సబ్జెక్టుని నమ్ముకోవడమే ముఖ్యమని గుర్తించి దేవుళ్ళు కథను రాసుకున్నారు. రచయిత రాజేంద్రకుమార్ తో కలిసి పక్కా స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు. చేగొండి హరిబాబు, కరాటం రాంబాబులు నిర్మాతలుగా కేవలం ఇద్దరు చిన్న పిల్లలను ప్రధాన పాత్రల్లో తీసుకుని ప్రాజెక్టుని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బడ్జెట్ చిన్నదేమీ కాదు మరి.

విప్లవ సినిమాలకు పేరొందిన వందేమాతరం శ్రీనివాస్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పుడూ అదే ఆశ్చర్యం. ఈ విభాగంలోనే దీనికి నంది అవార్డు దక్కడం కోడి జడ్జ్ మెంట్ లోని గొప్పదనాన్ని చాటుతుంది. దేవుళ్ళుగా సుమన్, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, లయ, ఎస్పి బాలసుబ్రమణ్యం లాంటి క్యాస్టింగ్ ని తీసుకోవడంతో ప్రేక్షకులు గొప్ప అనుభూతికి లోనయ్యారు. విడిపోయిన తల్లితండ్రులను కలపడం కోసం ఇద్దరు చిన్నారులు దేవుళ్ళ సహాయం తీసుకోవడం ఇందులో మెయిన్ పాయింట్. 2000 నవంబర్ 10న దేవుళ్ళు విడుదలై ఘనవిజయం అందుకుంది. అదే రోజు వచ్చిన చిరునవ్వుతో, కాలేజ్ లు కూడా సక్సెస్ కావడం విశేషం.

Also Read : Donga Donga : వర్మ ఛాయల్లో మణిరత్నం సినిమా – Nostalgia