Idream media
Idream media
రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి, అనధికారిక కొనుగోళ్లు, అప్పటి ప్రభుత్వం నిబంధలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలతో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, భూముల వ్యవహారంలో పాత్ర ఉన్న నేతలకు చిక్కులు తప్పడం లేదు. తాజాగా ఏపీ సీఐడీ అసైన్మెంట్ భూముల కొనుగోలు చేసిన వారికి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారనే అభియోగాలతో నాటి సీఎం, ఏపీసీఆర్‌డీఏ చైర్మన్ చంద్రబాబు, పట్టణ, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణలకు నోటీసులు జారీ చేసింది. అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు కూడా తాకీదులు ఇచ్చింది. సీఐడీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.
అమరావతి భూముల అక్రమాలపై ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం చర్యలు, సీఐడీ, ఏసీబీ విచారణ, సిట్ విచారణలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించింది. సుప్రింలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా సీఐడీ కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు..? ఫిర్యాదు ఏమిటి..? చంద్రబాబు పాత్ర ఏమిటి..? సీఎంగా చంద్రబాబు నేరం ఏ విధంగా చేశారు..?
అమరావతి నిర్మాణం కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించింది. రైతులకు నగదు బదులు వారి భూములను అభివృద్ధి చేసి.. అందులో కొంత భాగం పరిహారంగా ఇవ్వడమే ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రధాన అంశం. ఈ విధానంలో భాగంగా ప్రభుత్వం ముందు పట్టా భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంది.
పట్టా భూములతోపాటు రాజధాని ప్రాంతమైన 29 గ్రామాల్లో అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వాటిని గతంలో ప్రభుత్వం సాగు చేసుకునేందుకు దళితులకు కేటాయించింది. పట్టా భూములతోపాటు వాటి పక్కనే ఉన్న అసైన్మెంట్ భూములను ఒకే సారి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌లో సేకరించలేదు. ఆ సమయంలో ఓ ప్రచారం రాజధాని ప్రాంతంలో జరిగింది. అసైన్మెంట్ భూములు ప్రభుత్వానివే కాబట్టి.. వాటన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, నగదు ఏమీ ఇవ్వదు.. అనే ప్రచారం ఓ పద్ధతి ప్రకారం సాగించారు.
ఈ ప్రచారం సాగించిన కొంత మంది.. వాటిని కొనగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రభుత్వం తీసుకుంటే రూపాయి కూడా ఇవ్వదు.. మాకు విక్రయించాలని వారు దళితుల ముందు ప్రతిపాదనలు పెట్టారు. అసలు ఏమీ రాకపోయేదానికన్నా.. ఎంతో కొంత రావడం మేలే కదా అన్నట్లుగా దళితులు తమ అసైన్మెంట్ భూములను వారికి విక్రయించారు. ఇలా దాదాపు 500 ఎకరాలను దళితుల నుంచి టీడీపీ మద్ధతుదారులు, ఆ పార్టీ నేతలు తమ బినామీల ద్వారా కొనుగోలు చేశారు.
Also Read : అమరావతి భూముల కేసు – చంద్రబాబు ఇంటికి సిఐడి
అసైన్మెంట్ భూములన్నీ దళితుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత.. వాటిపై కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పిస్తూ రెవెన్యూ అధికారులు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియలో అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రమేయం ఉందన్నది అభియోగం. సాధారణంగా అసైన్మెంట్ భూములను కొనడానికి, అమ్మడానికి వీలులేదు. ఎన్నేళ్లైనా ఆ భూములును సదరు వ్యక్తి సాగు చేసుకోవాలి. ఆయన తర్వాత వారసులు ఆ భూమిని సాగు చేసుకోవచ్చు. కానీ ఎక్కడా విక్రయించేందుకు అవకాశం లేదు. కానీ ఇక్కడ అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసేందుకు ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేసి.. దళితుల నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టారనేది ప్రధాన అభియోగం.
దళితుల నుంచి అనధికారికంగా భూములు కొనుగోలు చేయడం పూర్తయింది. ఆ తర్వాత అసైన్మెంట్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని నిర్మాణం కోసం తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అవసరమైన విధాన నిర్ణయం తీసుకుంది. దళితుల నుంచి కారుచౌకగా భూములు కొనుగోలు చేసిన వారు ఆ భూములను ప్రభుత్వానికి ల్యాండ్‌పూలింగ్ కింద ఇచ్చి.. విలువైన ఫ్లాట్లు, ప్రతి ఏడాది కౌలు పొందుతున్నారు.
ఇలా కుట్రపూరితంగా దళితుల భూములను టీడీపీ మద్ధతుదారులు, ఆ పార్టీ నేతలు కొట్టేశారని, వారికి లబ్ధిచేకూరేలా నాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు వ్యవహరించారని దళిత సంఘాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకొచ్చాయి. వారు ఇచ్చిన ఆధారాలతో ఎమ్మెల్యే సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత నెల 24వ తేదీన ఫిర్యాదు రాగా.. విచారణ చేసిన సీఐడీ ప్రాథమిక ఆధారాలను సేకరించింది. ఈ వివరాలతో ఈ నెల 12వ తేదీన కేసు నమోదు చేసింది. కేసు నమోదు, అందులోని వివరాలను సీఐడీ గుంటూరు 6వ సివిల్ జడ్జికి వివరించింది. సాంకేతికపరమైన, న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతనే.. సీఐడీ చంద్రబాబుకు, నారాయణకు నోటీసులు జారీ చేసింది.
నేరం ఇలా జరిగితే.. టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. దళితుల భూములు ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోకూడదా..? వారికి ప్రయోజనం చేకూర్చకూడదా..? అంటూ ఆ భూములను దళితుల నుంచే ప్రభుత్వం తీసుకున్నట్లుగా టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్యలు వాదిస్తున్నారు. ఆ భూములను దళితుల నుంచి టీడీపీ మద్ధతుదారులు, నేతల బినామీలు కొనుగోలు చేసిన తర్వాత.. వాటిని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వం తీసుకుందని, అందు కోసం ప్రత్యేకంగా జీవో జారీ చేసిందనే సీఐడీ అభియోగాలను ప్రస్తావించకుండా.. చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారంటూ పడికట్టు పదాలతో సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.
Also Read : అమరావతి.. ఇంకా తేలలేదు