iDreamPost
android-app
ios-app

2 రూపాయ‌ల కాలంలో కోటి క‌లెక్ష‌న్ – Nostalgia

2 రూపాయ‌ల కాలంలో కోటి క‌లెక్ష‌న్ – Nostalgia

1973లో పెద్ద ఊళ్ల‌లో క్లాస్ టికెట్ 2 రూపాయ‌లు, చిన్న ఊళ్ల‌లో రూపాయి. ఆ రోజుల్లో NTR దేశోద్ధార‌కులు కోటి రూపాయ‌లు వ‌సూలు చేసింది. క‌థ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే వేగంగా ఉండ‌డం క‌లిసొచ్చింది. పాట‌లు సూప‌ర్‌హిట్ కావ‌డం, చిత్రీక‌ర‌ణ క‌ల‌ర్‌లో రిచ్‌గా ఉండ‌డం ప్ల‌స్‌. NTR మారువేషాలు వేస్తే హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఇండ‌స్ట్రీలో ఉండేది. దాంతో ప్ర‌తి సినిమాలో అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా మారువేషం మ‌స్ట్‌. చాలా సినిమాల్లో విల‌న్ ఆట క‌ట్టించ‌డానికి క్లైమాక్స్ మొత్తం మారువేష‌మే న‌డిచేది. ఈ సినిమా ప్ర‌త్యేక‌త ఏమంటే ముప్పావు సినిమా మారువేషాలే. అదీ రెండు క్యారెక్ట‌ర్ల‌లో. ఆ వేషాల‌న్నీ NTRవే అని తెలిసినా ప్రేక్ష‌కులు సస్పెన్స్ ఫీల్ అయ్యేవాళ్లు.

దారుణం ఏమంటే ఒక విగ్ పెట్టుకుని , న‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌తో హీరో వ‌స్తే హీరోయిన్ వాణిశ్రీ గుర్తు ప‌ట్ట‌క‌పోగా , అత‌నే బ్రౌన్ దొర అనుకుని సెక్ర‌ట‌రీగా ప‌నిచేస్తుంది. జ‌నాల్ని ముంచి ప‌డేసే విల‌న్ నాగ‌భూష‌ణం బ్రౌన్ దొర పిచ్చి తెలుగు మాట్లాడితే అత‌నికి త‌న డ‌బ్బుల‌న్నీ ఇచ్చేస్తాడు. స‌త్య‌నారాయ‌ణ‌, రాజ‌నాల ఇద్ద‌రూ బంగారు స్మ‌గ్లింగ్ చేసే క్రిమిన‌ల్స్‌. వాళ్లు కూడా రింగుల జుత్తు, గ‌ళ్ల బ‌నియ‌ను, ముఖాన క‌త్తి గాటుతో NTR వ‌స్తే “చాకు భ‌రోసా” అనే రౌడీ అనుకుంటారు కానీ, “విగ్గు ఊడిపోతోంది బాస్” అన‌రు.

లాజిక్ అవ‌స‌రం లేని కాలం. సినిమా లిబ‌ర్టీగా ఎన్ని వేషాలైనా వేయొచ్చు. ఫైన‌ల్‌గా ఆడిందా లేదా? ఆడింది. హౌస్‌ఫుల్‌గా ఆడింది. బ్లాక్ టికెట్ల‌ వాళ్లు పండ‌గ చేసుకున్నారు. సైకిల్ స్టాండ్ వాడు కొత్త సైకిల్ కొనుక్కున్నాడు. (ఆ రోజుల్లో సైకిల్ రూ.200. అంటే తులం బంగారం వ‌చ్చేది) థియేట‌ర్‌ని న‌మ్ముకుని బ‌తికే చిన్న ప్రాణాలు శ‌న‌క్కాయ‌లు అమ్మే అవ్వ‌, సోడాల‌మ్మే సాయిబు, బ‌జ్జీలు, బోండాలు అమ్మే ఎంక‌టేశ్ అంద‌రూ హ్యాపీ. సినిమా బ‌తికితే ఇంత మంది బ‌తుకుతారు. బ‌తుక్కు మించిన మ్యాజిక్ లేదు. లాజిక్ అంత‌కంటే లేదు.

1973 నాటికి పాకిస్తాన్‌తో యుద్ధం ముగిసింది (1971). అన్ని ధ‌ర‌లు పెరిగాయి. జైఆంధ్రా ఉద్య‌మం వ‌చ్చి వెళ్లింది (1972). సామాన్యుల బ‌తుకు క‌ష్టంగా ఉన్న కాలం. రేష‌న్ షాపు ముందు క్యూలు పెరుగుతున్న రోజులు. గంగ‌ చంద్ర‌ముఖిగా మారుతున్న‌ట్టు రాజ‌కీయ నాయకులు అవినీతి ప‌రులుగా రూపుదిద్దుకుంటున్న స్థితి. ఈ నేప‌థ్యంలో మ‌హార‌థి, మోదుకూరి జాన్స‌న్ రాసిన డైలాగ్‌లు ట‌పాసుల్లా పేలాయి. మామూలు డైలాగ్‌ని కూడా టైమింగ్‌తో టైమ్‌బాంబులా పేల్చ‌గ‌ల నాగ‌భూష‌ణం విల‌న్‌.

Opening sceneలో నాగ‌భూష‌ణం త‌న శిలావిగ్ర‌హాన్ని తానే ఆవిష్క‌రించుకుంటాడు. మెడ‌లోని పూల దండ‌ల్ని అల్లు రామ‌లింగ‌య్య తీయ‌బోతే ప్ర‌జ‌లు మోపిన భారాన్ని తాను తీయ‌లేన‌ని అంటాడు. ప్ర‌జ‌ల క‌ష్టాల్ని తీర్చి స్వ‌ర్గాన్ని చూపిస్తాన‌ని వాగ్దానం చేస్తాడు.

“మ‌మ్మ‌ల్ని మేం మోసం చేసుకోవ‌డ‌మే తెలుసు, విదేశీయుల్ని మోసం చేయ‌డం తెలియ‌దు. మా దేశ చ‌రిత్ర మీకు తెలుసు క‌దా”
“మీరు గాంధేయులా, బ్రాందేయులా?
దేనిక‌దే ప‌గ‌టి పూట సూర్యున్ని రాత్రిపూట చంద్రున్ని గౌర‌వించిన‌ట్టు రెంటినీ గౌర‌విస్తాం”
“అడ‌విలో ఆన‌క‌ట్టు వ‌స్తుంద‌ని ముందే తెలిసి వెయ్యి ఎక‌రాలు కొన్నాను”

ఎక్క‌డ ప్రాజెక్టులొస్తాయో, ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభిస్తారో ముందే తెలిసి భూముల్ని కొన‌డం అప్పుడే ప్రారంభ‌మైంది. సినిమాలు ఒక ర‌కంగా అనేక సామాజిక రాజ‌కీయ అంశాల‌కి సాక్ష్యాలుగా నిలుస్తాయి. రేష‌న్ షాప్‌లో క‌ల్తీ తీవ్ర‌మైంద‌ని అల్లు రామ‌లింగ‌య్య షాప్ చెబుతుంది. రూపాయిన్న‌ర బియ్యాన్ని మూడు రూపాయ‌ల‌కి బ్లాక్‌లో అమ్మారు. పురుగులు, రాళ్లు ఉన్న బియ్యం వ‌ల్ల ప‌ద్మ‌నాభం భార్య చ‌నిపోతే పిచ్చోడై పోవ‌డం జ‌నాల‌కి క‌నెక్ట్ అయింది. రైస్ మిల్లులో బియ్యాన్ని నిల్వ చేసి , జ‌నాల‌కి తిండి దొరక్కుండా చేసే రోజులు. నిత్యావ‌స‌రాల చ‌ట్టం ఎప్పుడూ ప‌నిచేయ‌దు. చ‌ట్టాన్ని త‌న ప‌ని తాను చేయ‌కుండా చేయ‌డ‌మే రాజ‌కీయం.

అప్ప‌ట్లో NTR సినిమాల‌న్నిటిలో ఒకే క‌థ వుండేది. అన్న‌ని విడిపించ‌డానికి త‌మ్ముడు ఆడే నాట‌కం క‌థానాయ‌కుడు (1969), త‌ల్లిమీద ప‌డిన నింద‌ని తొల‌గించ‌డానికి కొడుకు ప్ర‌య‌త్నం క‌ద‌ల‌డు వ‌ద‌ల‌డు (1969), తండ్రి కంటి చూపు కోసం కొడుకు సాహ‌సం గులేబ కావ‌ళి క‌థ (1962). అన్నీ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌. దేశోద్ధార‌కులు కూడా జైలుకు వెళ్లిన అన్న కోసం, తండ్రి మీద ప‌డిన నింద‌ని మాప‌డానికి హీరో ఆడిన నాట‌క‌మే. అయితే ఇది మారు వేషాల్లో కొత్త ట్విస్ట్ ఇచ్చింది.

మాస్క్‌లు వేసుకుని ఇత‌రుల్లా క‌నిపించే సినిమా టెక్నిక్ ఎవ‌డు క‌నిపెట్టాడో కానీ కొంత కాలం పాటు రాజ్య‌మేలింది. NTR వేషంలో ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఉండ‌డ‌మే ట్విస్ట్‌. మా అయ్య వారిలా మాస్క్ వేసుకుని (సుబ్బ‌నాచారి అనే లెక్క‌ల్ టీచ‌ర్ రాయ‌దుర్గం హైస్కూల్లో పిల్ల‌ల్ని తోమ‌డంలో ఎక్స్‌ఫ‌ర్ట్‌. బెత్తంతో పిర్ర‌ల మీద కొట్ట‌డం స్పెషాల్టీ) క్లాస్‌లో అందర్నీ ఉత‌కాల‌ని అనుకున్నా. అయితే మాస్క్‌లెక్క‌డ దొరుతాయో తెలియ‌లేదు.

రాయ‌దుర్గంలో ఏదైనా దొరికే శీన‌య్య‌, శ‌ర‌ణ‌ప్ప అంగ‌ళ్ల‌లోనే మాస్క్‌లు లేవంటే ఇంకెక్క‌డా లేన‌ట్టే అని తీర్మానించుకుని గ‌మ్మునైపోయా.

క‌రోనా కాలం ఒక‌టి వ‌స్తుంద‌ని , ప్ర‌పంచ‌మంతా మాస్క్‌ల‌తోనే తిరుగుతుంద‌ని అప్పుడు తెలియ‌దు.

అన‌వ‌స‌రంగా క‌రోనా మీద నింద‌లేస్తాం కానీ, మ‌నం మాస్క్‌ల‌తో మారువేషాల‌తో , మ‌న‌ది కాని జీవితాన్ని జీవించ‌డం ఎప్పుడో మొద‌లైంది. కావాలంటే అద్దంలో చూసుకోండి. మిమ్మ‌ల్ని మీరు గుర్తు ప‌ట్ట‌లేరు.