తప్పుడు యాడ్స్, తప్పుదోవ పట్టించే యాడ్స్ చేస్తే ఇకపై శిక్షలే.. సెలబ్రిటీలు జాగ్రత్త..

సెలబ్రిటీలంతా డబ్బుల కోసం యాడ్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు డబ్బుల కోసం ఎలాంటి యాడ్స్ పడితే అలాంటివి చేస్తున్నారు. చేయకూడని యాడ్స్ చేసి విమర్శల పాలవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు రకరకాల యాడ్స్ లో భాగమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది చేసిన యాడ్స్ ని నిషేధించిన సందర్భాలు, కేసు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా యాడ్స్ (ప్రకటనలు) కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలని ప్రకటించింది. వీటి ప్రకారం వినియోగదారులను ఆకర్షించేలా రాయితీలు, ఉచితాలు వంటి ప్రకటనలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటూ చేసే యాడ్స్‌, నిషేదిత యాడ్స్, తప్పుదోవ పట్టించే యాడ్స్, తప్పుడు సమాచారంతో కూడిన యాడ్స్ ని కేంద్రం నియంత్రించింది. ‘‘తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధం, 2022’’ పేరిట కఠిన నిబంధనలతో కూడిన తాజా మార్గదర్శకాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది.

ఇక ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ప్రకటన తయారు చేసిన సంస్థ, ఆ ఉత్పత్తి సంస్థ, అందులో నటించిన వారిపై వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రకటనలకు సంబంధించి తొలిసారి నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షలు, తర్వాత ప్రతిసారీ రూ.50 లక్షలు జరిమానా విధిస్తారు. తయారీదారులు, ప్రచారకర్తలు, ప్రకటనకర్తలు అందరికీ ఇది వర్తిస్తుంది. అలాగే తప్పుదోవ పట్టించే ప్రకటనల ప్రచారకర్తలపై ఏడాది పాటు నిషేధం, మళ్లీ ఉల్లంఘిస్తే మూడేళ్ళ వరకు నిషేధం పొడగింపు ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ప్రకటించారు.

ప్రింట్‌, టీవీ, ఆన్‌లైన్‌ వంటి అన్ని వేదికలపై ఇచ్చే ప్రకటనలకు ఈ రూల్స్ వర్తిస్తాయని, అలాంటి ప్రకటనలపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు అని, ప్రభుత్వరంగ సంస్థలు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపారు. కాబట్టి సెలబ్రిటీలు ఇకపై యాడ్స్ చేసే ముందు దాని గురించి తెలుసుకొని, కేవలం డబ్బు కోసమే కాకుండా చేయండి. అలాగే యాడ్స్ డిజైన్ చేసేవాళ్ళు కూడా. లేదంటే జరిమానాలు తప్పవు.

Show comments