iDreamPost
android-app
ios-app

Delhi Fire Tragedy ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..27 మంది మృతి, 50 మందికి గాయాలు

  • Published May 14, 2022 | 12:04 PM Updated Updated May 14, 2022 | 12:04 PM
Delhi Fire Tragedy ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..27 మంది మృతి, 50 మందికి గాయాలు

ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మూడంతస్తుల భవంతిలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 27 మంది మృతి చెందగా, సుమారు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతులలో ఎక్కువమంది మహిళలే. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమంచారు. అర్థరాత్రి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో కొందరిని స్థానికులు, మరికొందరిని ఫైర్ సిబ్బంది, పోలీసులు రక్షించారు. మొత్తంగా 60-70 మంది అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, భవంతిలో పలు కంపెనీలకు చెందిన కార్యాలయాలున్నట్లు డీసీపీ శర్మ తెలిపారు. తొలుత మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాల సంస్థలో మంటలు ఏర్పడి, క్రమంగా అవి మూడంతస్తులకు వ్యాపించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం భవన యజమాని పరారీలో ఉన్నాడని, అతనికోసం వెతుకుతున్నామని డీసీపీ మీడియాకు చెప్పారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రధాని తెలిపారు