iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో మాంసం దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశాలు..

ఢిల్లీలో మాంసం దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశాలు..

చైత్ర నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మాంసం విక్రయాలను నిషేధించారు. ఈనెల 4 నుంచి 11 వరకు దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మాంసం దుకాణాలను మూసివేస్తామని మేయర్‌, బీజేపీ నేత ముఖేశ్‌ సూర్యన్‌ ప్రకటించారు. మాంసం దుకాణాల వల్ల దుర్వాసన వస్తుందని, దీనివల్ల భక్తుల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంటూ దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ భారతికి ఆయన లేఖ రాశారు. నవరాత్రుల కాలంలో దుర్గామాత భక్తులు మాంసాహారం, మద్యం, కొన్ని సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు.

నవరాత్రులు ముగిసేవరకు మాంసం దుకాణాలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేయించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా మేయర్‌ ముఖేశ్‌ లేఖ రాశారు. తాము తీసుకున్న నిర్ణయంలో తప్పులేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ 8,9,10 తేదీల్లో దక్షిణ ఢిల్లీలోని అన్ని కబేళాలను మూసివేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. మరోవైపు తూర్పు ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, బీజేపీ నేత శ్యామ్‌సుందర్‌ అగర్వాల్‌ కూడా దక్షిణ ఢిల్లీ మేయర్‌ అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే నవరాత్రుల వేళ మాంసం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

కాగా, చైత్ర నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలో మాంసం దుకాణాల మూసివేతపై మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా పారిశ్రామికవేత్తలకు వ్యాపారం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్న ప్రధాని మోడీ.. సైద్ధాంతిక అనుచరులకు మతోన్మాద సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల జరిగే ఆదాయ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. మాంసం అశుద్థమైనది కాదని.. వెల్లుల్లి, ఉల్లిపాయలా ఆహారం మాత్రమేనని పేర్కొన్నారు. తమకు ఇష్టంలేదని భావిస్తే 99 శాతం కాదు 100 శాతం మంది ప్రజలు మాంసాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే ఉండదని అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం ట్విట్టర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మాంసం దుకాణాలను తెరవాలని డిమాండ్‌ చేశారు.