iDreamPost
android-app
ios-app

ఆమోదం పొందిన వికేంద్రికరణ బిల్లు – ఇరకాటంలో పవన్ కళ్యాణ్

  • Published Jul 31, 2020 | 2:31 PM Updated Updated Jul 31, 2020 | 2:31 PM
ఆమోదం పొందిన వికేంద్రికరణ బిల్లు  – ఇరకాటంలో పవన్ కళ్యాణ్

రాజధాని వికేంద్రికరణ బిల్లు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం పొందింది. దీంతో రాజధాని తరలింపు ఇక లాంఛనమే అని తెలుస్తుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ది చెందాలనే ఆలోచనతో రాజధాని వికేంద్రికరణపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాజధాని వికేంద్రికరణకు తాము ఒప్పుకునేదే లేదు అంటు తేగేసి చెప్పింది. చంద్రబాబు అమరావతిలో పర్యటించి దీక్షలు ధర్నాలు నిర్వహించారు. మండలిలో తనకి ఉన్న బలంతో శాయశక్తులా అడ్డుకునే ప్రయత్నం చేసారు.

అయితే స్వతహాగా రాజకీయంగా రాష్ట్రంలో ముఖ్యామంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలతో పాటు జనసేన పార్టీ సైతం వికేంద్రికరణకు తాను వ్యతిరకం అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఏకంగా రాజధాని ప్రాంతలలో పర్యటించి రాజధానిని కదిలించే సత్తా ఎవ్వరికి లేదని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడూ ఆయనను ఇరకాటంలోకి నెట్టే విధంగా ఉన్నాయి.

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీతో కలిసారు. ఈ సందర్భంలో ఆయన నేను భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతాం అని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ అభివృద్ది వికేంద్రికరణపై ప్రకటన చేయడంతో దానిని తాను వ్యతిరేకిస్తు రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ కీలక వాఖ్యలు చేశారు. అమరావతి కోసమే తాను భారతీయ జనతా పార్టీతో కలిసానని, రాజధానిని కదిలించే శక్తి జగన్ కు లేదని, అమరావతి రాజధానిగా ఉంటుందనే ఒప్పందం బీజేపీతో రాసుకున్న తరువాతే తాను ఆ పార్టీతో కలిసానని కావున రాజధాని మూడూ ముక్కలు అయ్యే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు.

ఒక పక్క పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో బీజేపీ తాము కలిసి వ్యతిరేకిస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చినా చివరికి బీజేపీ పవన్ మాటలను లెక్క చేయకుండా తాము అభివృద్ది వికేంద్రికరణకు మద్దతు ఇస్తామని, వికేంద్రికరణ మా పార్టి విధానం అని, అందులో భాగంగానే రాయల సీమలో హైకోర్టు పెట్టాలని తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టామని ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమని ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అని చెబుతు పవన్ వాఖ్యలకు భిన్నంగా స్పందించారు.

తాను బీజేపీ కలిసి వికేంద్రికరణను అడ్డుకుంటామని, అందుకే బీజేపీతో పొత్తులో ఉన్నానని, దీనిపై ఒప్పందం కూడా చేసుకున్నామని పవన్ కళ్యాణ్ చెబుతుంటే బీజేపీ తాజగా పవన్ వైఖరికి భిన్నంగా స్పందించడంతో పవన్ పూర్తిగా ఇరకాటంలో పడ్డారు. మొదటి నుండి రాజధాని వ్యవహారాన్ని వ్యతిరేకిస్తు ప్రకటనలు చేసిన పవన కళ్యాణ్ తాజా బీజేపీ నేతల స్పందనతో తన పార్టీ తరుపున ఎలా స్పందిస్తారో అనే చర్చ జోరుగా సాగుతుంది. రాజధాని వ్యవహారంలో జగన్ పై ఉన్న వ్యతిరేకతతో అతిగా స్పందించి పవన్ ఎటూ మట్లాడే పరిస్థితిలేక పూర్తిగా ఇరుక్కుపోయారనే వాదన రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తుంది.