iDreamPost
android-app
ios-app

చీకటి రోజులకు అర్ధశతదినోత్సవం

  • Published May 05, 2020 | 5:46 AM Updated Updated May 05, 2020 | 5:46 AM
చీకటి రోజులకు అర్ధశతదినోత్సవం

మాములుగా పేపర్లలో ఫలానా సినిమా 50 రోజులు ఆడింది, ఇన్ని సెంటర్స్ లో విజయ కేతనం ఎగురవేసిందనే ప్రకటనలు తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. కాని చరిత్రలో ఎన్నడూ చూడని అగాధం ఉప్పెనలా వచ్చి పడి కోట్లాది ప్రేక్షకుల వినోదాన్ని దూరం చేయడంతో పాటు పరిశ్రమ మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలను ఆకలికి దగ్గర చేసింది. థియేటర్లు, మాల్స్ మూతబడి సరిగ్గా ఇవాళ్టికి 50 రోజులు. మార్చ్ 14 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మూతబడిన గేట్లు ఇప్పటిదాకా తెరుచుకోనేలేదు.

గతంలో ఉద్యమాలు, బందులు తదితర నిరసనలతో మహా అయితే ఐదారు రోజులకు పరిమితమైన మూసివేత ఇప్పుడు రెండు నెలలకు పైగా కొనసాగడం చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికీ లాక్ డౌన్ సంపూర్ణంగా ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మినహాయింపుల్లో సినిమా హాళ్ళు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

షూటింగులు ఆగిపోయాయి. వాటికి అనుమతులు ఇచ్చినా థియేటర్లు తీయడానికి మాత్రం ఇంకొంత కాలం పట్టొచ్చని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే సింగల్ స్క్రీన్ల యాజమాన్యాలు తమ సిబ్బందిగా జీతాలు చెల్లించలేక అప్పులు తేలేక నానా యాతన పడుతున్నాయి.

మరోవైపు మల్టీ ప్లెక్సులు కూడా తమ స్టాఫ్ ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయట. వీటిలో పని చేయడం తప్ప ఇంకో నైపుణ్యం లేని వీళ్ళంతా ఇంకో రంగానికి వెళ్ళలేరు. అలా అని అవసరాలను అణుచుకోనూ లేరు. ఇంతటి సంకట స్థితిని తమ జీవితంలో ఊహించలేదని మూడు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగులు చెప్పడం ఇక్కడ గమనించాలి. జనం ఎప్పటిలాగా థియేటర్లకు రావాలంటే కనీసం ఆగస్ట్ లేదా సెప్టెంబర్ దాకా పడుతుందని లేదా అంతకు మించినా ఆశ్చర్యం లేదని ఓ అగ్ర నిర్మాత ఇటీవలే వ్యాఖ్యానించడం పరిస్థితిలోని తీవ్రతకు అద్దం పడుతోంది. చూస్తుంటే ఈ చీకటి రోజులు వంద రోజులు దాటినా ఆశ్చర్యం లేదు. ఒకప్పడు ఇవే హండ్రెడ్ డేస్ సంబరాలు చేయిస్తే ఇప్పుడు మాత్రం కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి.