Dharani
Dharani
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనారోగ్యం పాలయ్యారు. ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఉన్న మందపల్లి శనేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. శని త్రయోదశి సందర్భంగా కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. శని దోష నివారణ కోసం ఆలయంలో తైలాభిషేకం చేయిస్తుండగా.. ఉన్నట్లుండి ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడ్డారు. ఆయన పరిస్థితి గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆలయంలోనే ఓ పక్కన కూర్చోపెట్టారు. కాసేపు సేద దీరే ఏర్పాట్లు చేశారు.
తన కుటుంబసభ్యులు, సన్నిహితులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసే వరకు దగ్గుబాటి వెంకటేశ్వరావు అక్కడే ఉన్నారు. గతంలోనూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు గుండె నొప్పి రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరి.. అక్కడ చికిత్స తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా ఉన్నట్లుండి అస్వస్థతకు గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. కాసేపటికి.. ఆయనకు కేవలం కళ్లు తిరిగాయని.. ఇతర అనారోగ్య సమస్యలు ఏమి లేవని దగ్గుబాటి కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు హితేష్ కూడా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డబ్బు, కక్ష సాధింపులతో రాజకీయాలు చేయడం తమ కుటుంబానికి అలవాటు లేదని.. అందుకనే తాను, తన కుమారుడు.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆయన పోటీ చేయలేదు.. దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన కుమారుడితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరి.. పర్చూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. వెంకటేశ్వరరావు సతీమణి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.