డబ్బంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దానిని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. అందుకే రేయింబవళ్లు కష్టపడి డబ్బులను సంపాదిస్తున్నారు. ఇక ఊరికే వస్తున్నాయంటే ఎవరు మాత్రం కాదంటారు. ఇటీవల కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లోని రోడ్లపై 500 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మందికి ఐదు వందల రూపాయలతో కూడిన పర్సులు దొరికాయి. ఇదే అంశం సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. చాలా మంది తమకు కూడా దొరికే అవకాశం ఉందని ఆశ పడుతున్నారు. హైదరాబాద్ రోడ్లపై 500 నోట్లతో కూడిన పర్స్ దొరకడం వాస్తవమే. అయితే అవి నిజమైన నోట్లు కాదు. హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచారం ఇది.
నేటి కాలంలో ఆ బలహీనతే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సైబర్ కేటుగాళ్ల బారిన పడి.. పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నారు. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకే తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వైరల్ అవుతోన్న వీడియోలో 500 రూపాయల నోటు ఉన్న పర్సును రోడ్డుపై, మెట్రో స్టేషన్ల వద్ద వేయగా.. ప్రజలు పర్సు అనుకుని తెరిచి చూస్తారు. అంతే అందులో సైబర్ నేరాలపై 1930 నంబర్ కి కాల్ చేయాలని సమాచారం ఉంటుంది. అసలు నోట్లకు, నకిలీకి నోట్లకు మధ్య తేడాలు గుర్తించాలని, ఆశపడకుండా అప్రమత్తంగా ఉండాలనే సందేశం అందులో ఉంటుంది.
ఇక పోలీసులు పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. అచ్చం ఈ పర్సు లాగానే ఆన్‌లైన్ మోసాలు కూడా ఉంటాయని.. ఆశపడి అలాంటి మాయల్లో చిక్కుకుని మోసపోవద్దని ఈ బ్రోచర్ ద్వారా ప్రజలకు పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ నేరాలకు ఫిర్యాదు చేసే 1930 ఫోన్ నెంబర్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ ప్రచారం చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రచారంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలను సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు
ఇక సైబర్ నేరాలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నెంబర్‌తో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ కాల్ సెంటర్ కొనసాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్‌సెంటర్ పనిచేస్తోంది. ఈ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను మేనేజ్ చేసేందుకు ఎక్సోటెల్ అనే సాంకేతికతను పోలీసులు ఉపయోగిస్తున్నారు. మరి.. హైదరాబాద్ పోలీసులు సైబర్ మోసాలపై చేస్తున్న ఈ వినూత్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Real vs. Rogue
Just like this Wallet, Online Fakes abound.
If you are a Cyber Victim and Lost Money
call 1930
Stay Vigilant, Stay Secure!
– Telangana State Cyber Security Bureau (TSCSB) pic.twitter.com/7uVysT5p03— Cyberabad Police (@cyberabadpolice) September 11, 2023