iDreamPost
iDreamPost
ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళకు ఇకనుండి తిప్పలు తప్పేట్లు లేదు. మామూలుగా ఎన్నికల సమయంలో పోటిచేసే అభ్యర్ధులు ఎన్నికల కమీషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఆఫిడవిట్లలో తమకున్న ఆస్తులు, అప్పులు, కుటుంబసభ్యుల వివరాలతో పాటు తమపై ఉన్న కేసుల వివరాలను కూడా ఇవ్వాలి. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం అందరు అభ్యర్ధులు అన్నీ వివరాలు ఇవ్వాల్సున్నా కొందరు అభ్యర్ధుల విషయంలో అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతుంటాయి.
గెలిచిన అభ్యర్ధుల విషయంలో ఓడిపోయిన వాళ్ళు కొన్నిసార్లు కోర్టుకెళ్ళటం సహజమే. గెలిచిన అభ్యర్ధి తన అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చాడని, కేసుల వివరాలు ఇవ్వలేదని ప్రధానంగా ఆరోపణలు చేస్తుంటారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున అనంతపురం జిల్లాలో మకడశిర ఎస్సీ నియోజకవర్గంలో గెలిచిన కే ఈరన్న పై ఓడిపోయిన తిప్పేస్వామి హైకోర్టులో కేసు వేశాడు. ఈరన్న ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వలేదన్నది ప్రధాన ఆరోపణ. విచారణ తర్వాత ఈరన్న తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు నిర్ధారణయ్యింది. దాంతో ఎంఎల్యే పదవిని వదులుకోవాల్సొచ్చింది.
ఇప్పటి వరకూ తప్పుడు అఫిడవిట్లపై ఎన్నికల కమీషన్ విచారణ చేయటమన్నది లేదు. అభ్యంతరాలున్న వాళ్ళు నేరుగా కోర్టులో కేసు వేయటమే. అయితే ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఇకనుండి తప్పుడు అఫిడవిట్లు దాఖలుపై నేరుగా తమకే ఫిర్యాదులు చేయాలని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. తమకు అందిన ఫిర్యాదులపై నేరుగా తానే క్రిమినల్ విచారణ జరిపించాలని ఎన్నికల కమీషన్ తాజాగా నిర్ణయించింది.
ఎన్నికల కమీషన్ తాజా నిర్ణయంతో ఓ ఉపయోగం ఉంటుందనే చెప్పాలి. అదేమిటంటే తప్పుడు అఫిడవిట్లపై కోర్టులో విచారణ జరిపాలంటే సంవత్సరాలు పడుతుంది. కొన్ని కేసుల్లో పదవీకాలం పూర్తియినపోయిన తర్వాతే కోర్టులో తీర్పులు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక నుండి నేరుగా ఎన్నికల కమీషనే క్రిమినల్ విచారణ చేయిస్తే ఆ విచారణ తొందరగానే పూర్తయ్యే అవకాశాలున్నాయి. విచార్హణత ఉన్న కేసులను నేరుగా తామే సంబంధిత దర్యాప్తు సంస్ధకు పంపాలని నిర్ణయించటం మంచిదే. ఏదేమైనా తప్పుడు అఫిడవిట్లపై క్రిమినేల్ విచారణ జరిపించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించటం మంచిదే.