క్రికెటర్లు ఫామ్ అందుకోవడానికి 45 రోజులు పడుతుంది-రోహిత్ శర్మ

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మైదానాలకు దూరమైన క్రికెటర్లు మళ్లీ పూర్తిస్థాయిలో ఫామ్ అందుకోవడానికి కనీసం 45 రోజులు పడుతుందని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. దేశంలో లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు బ్యాటింగ్,బౌలింగ్,ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు పడట్లేదు.కానీ తమ శారీరక దేహ దారుఢ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.క్రికెట్ ప్రారంభమైన తరువాత బ్యాట్స్‌మెన్‌లు ఫామ్ లోకి రావడానికి కొంత సమయం పడుతుందని రోహిత్ తెలిపాడు.

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ లో రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘ బ్యాట్స్‌మెన్‌లు బంతిని చక్కగా బ్యాట్‌కి మిడిల్ చేయాలంటే కనీసం నెలన్నర సమయం పట్టే అవకాశం ఉంది.బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌ కంటికి,చేతికి మధ్య చక్కని సమన్వయం కుదిరితేనే సరైన షాట్ కొట్టగలరు. లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో గంటకి 140కిమీ వేగంతో బంతుల్ని విసిరే బౌలర్లని ఎదుర్కోవడం చాలా కష్టం. దాదాపు మూడు నెలలుగా ఆటగాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉండిపోయారు. కాబట్టి మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించాలంటే ప్రాక్టీస్ కీలకం’’ అని పేర్కొన్నాడు.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో ఐపీఎల్‌ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.కరోనా అదుపులోకి వచ్చి పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే అక్టోబర్,నవంబర్ మాసాలలో ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనుంది.ఈ మెగా టోర్నీకి క్రికెటర్లు సంసిద్ధం కావడానికి ప్రాక్టీస్ అవసరం.ఆటగాళ్లు పూర్వపు ఫామ్ అందుకునేందుకు శ్రమించాల్సి ఉంటుంది.

Show comments