Idream media
Idream media
అద్భుతమే జరిగింది… అవును ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్టు… వెంటనే పుంజుకుని అద్భుతమే చేసింది. పిచ్ ఆతిధ్య జట్టు పేసర్లకు అనుకూలంగా ఉన్నా ఓపెనర్ నుంచి చివరి ఆటగాడి వరకు ఉతికి ఆరేసారు. మొదటి ఇన్నింగ్స్ లో అనుభవాలను పాఠాలుగా మార్చుకుని… ఘనమైన విజయాన్ని అందుకున్నారు. మూడో టెస్ట్ ఓటమిని మర్చిపోతూ నాలుగో టెస్ట్ లో 157 పరుగుల తేడాతో విజయం సాధించారు.
ఓవల్ వేదికగా ముగిసిన నాలుగో టెస్ట్ లో భారత జట్టు ప్రదర్శన అది… మొదటి ఇన్నింగ్స్ లో వంద పరుగులు వెనుకబడటంతో రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు చాలా జాగ్రత్తగా ఆడారు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పేస్ విభాగాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. ఏ మాత్రం తడబడకుండా మన బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. అయితే కీలక సమయాల్లో వికెట్ కోల్పోయినా… ఎవరూ ఊహించని రీతిలో రిశబ్ పంత్, శార్దుల్ ఠాకూర్ ఇద్దరూ కూడా ఇంగ్లాండ్ ను ఏ మాత్రం తడబాటు లేకుండా ఎదుర్కొన్నారు. అడపాదడపా ఫోర్లు కొట్టి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసారు. అది హైలెట్ అయితే చివర్లో ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా చేసిన పరుగులు భారత్ కు బాగా కలిసి వచ్చాయి. దీనితో ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. లక్ష్యాన్ని చెధించాలనో లేక మ్యాచ్ ను డ్రా చేయాలనే ఉద్దేశమో గానో ఇంగ్లాండ్ ఓపెనర్లు బుర్న్స్, హమీద్ ఇద్దరూ కూడా చాలా తెలివిగా ఆడారు. ఏ మాత్రం కూడా తడబడకుండా సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసారు. అయితే అనూహ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన బంతికి ఓపెనర్ బర్న్స్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం ఇంగ్లాండ్ ను పెద్ద దెబ్బ కొట్టింది.
Also Read:ఇండియా గెలిచినట్లే …!
అక్కడి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా నమోదు కాలేదు. అయితే ఇక్కడ జడేజా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పేసర్లకు సహకరించే పిచ్ మీద జడేజా సైలెంట్ కిల్లర్ లా మారిపోయాడు. ఊహించని స్పిన్ తో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ని కుదురుగా నిలబడనీయలేదు. నిలబడుతున్నారు అనుకున్న కెప్టెన్ రూట్, ఓపెనర్ హమీద్ భాగస్వామ్యాన్ని తెలివిడిగా విడగొట్టాడు. అద్భుతమైన బంతితో హమీద్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
టీ సమయానికి 84 ఓవర్లు బౌలింగ్ చేస్తే అందులో 29 ఓవర్లు జడేజా వేసినవే. కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని జడేజా ఎక్కడా వమ్ము చేయలేదు. ఎకానమీ రెండు పరుగులు కూడా లేకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేసాడు. జడేజా బౌలింగ్ తోనే ఒకరకంగా ఇంగ్లాండ్ ఆత్మరక్షణలో పడిపోయింది. స్వేచ్చగా షాట్ లు ఆడలేక, కనీసం డిఫెన్స్ కూడా ఫ్రీ ఆడలేకపోయింది. ఏ మాత్రం అలసిపోకుండా తన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ లో మంచి వేరియేషన్స్ చూపించాడు. ఇక హమీద్ అవుట్ తర్వాత ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ క్రీజ్ లో నిలబడటానికి కష్టపడ్డారు.
జడేజా తన స్పిన్ తో ముప్పు తిప్పలు పెడుతున్న సమయాన… బూమ్రా, ఠాకూర్ చెలరేగిపోయారు. పకీలక వికెట్ లు తీసారు. హమీద్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఓలి పోప్ రెండు పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన బెయిర్ స్తో, మోయీన్ అలీ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ తో కలిసి కెప్టెన్ రూట్ ఇంగ్లాండ్ ని డ్రా దిశగా నడిపించాలని చూసాడు గాని పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు. కొత్త బంతి న్గ్లాండ్ ను బాగా డ్యామేజ్ చేసింది. మ్యాచ్ ని కాపాడే ప్రయత్నం చేసిన జో రూట్… శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
రూట్ తర్వాత క్రిస్ వోక్స్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో టీ ముందు కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టేయిలేండర్ లు ఒవర్తన్, రాబిన్సన్, అండర్సన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ పని చేయగా… మ్యాచ్ ని కాపాడింది మాత్రం ఇద్దరే… ఇంగ్లాండ్ కు రెండు ఇన్నింగ్స్ లలో అర్ధ సెంచరీలు చేసి చుక్కలు చూపించిన శార్దుల్ ఠాకూర్. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి అతను 117 పరుగులు చేసాడు.
Also Read:సూపర్,ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం, క్రెడిట్ ఆ ఇద్దరికే…!
కీలక సమయాల్లో చేసిన ఈ పరుగులు భారత్ ను పోరాడేలా మార్చాయి. ఏ మాత్రం తడబాటు లేకుండా ఇంగ్లీష్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఈ మ్యాచ్ లో శార్దుల్ ఆడకపోయి ఉండి ఉంటే భారత సీరీస్ కోల్పోయే ప్రమాదంలో పడి ఉండేది. బౌలింగ్ లో కూడా అతను ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసిన ఠాకూర్ రెండో ఇన్నింగ్స్ లో రెండు కీలక వికెట్ లు తీసాడు. భారీగా పరుగులు కూడా ఇవ్వలేదు. ఇక జడేజా గురించి పైన చెప్పుకున్నట్టే… చివరి రోజున ఇంగ్లాండ్ ను తన స్పిన్ తో ఆత్మరక్షణలో పడేసి… ఇంగ్లాండ్ ను స్వేచ్చగా ఆడనీయకుండా చేయగలిగాడు.
ఏది ఎలా ఉన్నా క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఈ మ్యాచ్ మంచి వినోదాన్ని అందించింది. అయిదు టెస్ట్ ల సీరీస్ లో ఇండియా 2-1 తో లీడింగ్ లో ఉంది. చివరి మ్యాచ్ లో గెలిచినా, డ్రా అయినా సరే భారత్ కు సీరీస్ దక్కినట్టే. ఈ మ్యాచ్ లో రహానే సహకారం లేకపోవడం భారత్ కు పెద్ద మైనస్ అయినా సరే… ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, మిడిల్ ఆర్డర్ లో పుజారా, పంత్, లోయర్ ఆర్డర్ లో ఠాకూర్, బూమ్రా, ఉమేష్ సమిష్టిగా రాణించి జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. మరి చివరి టెస్ట్ లో గెలిచి సీరీస్ అందుకుంటారో… ఓడి డ్రా చేసుకుంటారో చూడాలి.