క్రేజీ అంకుల్స్ రిపోర్ట్

నిన్న అయిదారు సినిమాలు రిలీజయ్యాయి కానీ అందులో బజ్ ఉన్నది ఒక్క రాజరాజ చోరకే. అయితే క్రేజీ అంకుల్స్ పేరుతో శ్రీముఖి ప్రధాన పాత్రలో రూపొందిన మరో మూవీ క్రేజీ అంకుల్స్ ఓ వర్గం ప్రేక్షకులను ఓసారి చూద్దామా అనిపించేలా ప్రమోషన్లు చేసుకుంది. ఓపెనింగ్స్ విషయంలో పెద్దగా అంచనాలు, ఆశలు లేనప్పటికీ ఏదైనా టాక్ తో అంతో ఇంతో వసూళ్లు వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు గత కొద్దిరోజులుగా కొంచెం హంగామా చేశారు. గుడ్ సినిమా గ్రూప్ సమర్పణలో శ్రేయాస్ మీడియా నిర్మాణ భాగస్వామిగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మరి కనీస హైప్ ని అందుకుందా లేక చేతులెత్తేసిందా రిపోర్ట్ లో చూద్దాం.

ఓ అపార్ట్మెంట్ లో ఉండే ముగ్గురు స్నేహితులు ఆర్ఆర్ఆర్ అంటే రాజా(రాజా రవీంద్ర), రెడ్డి(మనో), రావు(భరణి శంకర్). కొత్తగా అక్కడ చేరిన గాయని స్వీటీ(శ్రీముఖి)కి అందానికి ఫిదా అయిపోయి ఆమెను వలలో వేసుకునేందుకు నానా రకాల ఎత్తుగడలు వేస్తారు. ఆఖరికి ఆస్వీటీ అసిస్టెంట్ కు లంచెం ఇచ్చేందుకు కూడా వెనుకాడరు. మరి నిజంగా ఆ బ్యూటీ ఈ అంకుల్స్ కి పడిపోయిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఒక్క ఇంచు కూడా కొత్తదనం లేని ఈ క్రేజీ అంకుల్స్ ఏ దశలోనూ కనీస ఆసక్తి కలిగించకుండా చప్పగా సాగుతుంది. శ్రీముఖి కోసమే వెళ్తే మాత్రం నిరాశపడే అవకాశాలు చాలా ఎక్కువ.

ఎప్పుడో జమానాలో వచ్చిన జయసుధ ఆంటీ సినిమా కథనే అటుఇటు తిప్పి మళ్ళీ రాసుకుని నిర్మాతలను ఇంత ఈజీగా ఒప్పించిన రచయిత డార్లింగ్ స్వామిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. నవ్వడమంటే విరక్తి రావడం అనేలా ఇందులో జోకులను రాసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. రఘు కుంచె సంగీతం, బాల్ రెడ్డి ఛాయాగ్రహణం ఇవేవి వీక్ కంటెంట్ ని కాపాడలేకపోయాయి. ఏదో ఒకటి చుట్టేస్తే శాటిలైట్, డిజిటల్, ఓటిటి, డబ్బింగ్ అంటూ డబ్బులు చేసుకోవచ్చనే ఆలోచనతో తీసినట్టు ఉంది తప్ప రాశాక స్క్రిప్ట్ కూడా చెక్ చేసుకున్నట్టు కనిపించదు. ఇంత అవుట్ డేటెడ్ ప్రోడక్ట్ కి కారణమైన దర్శకుడు సత్తిబాబు గురించి చెప్పేదేముంది

Also Read : ఆచార్య భీమ్లా ఎక్స్ చేంజ్ ఆఫర్ ?

Show comments