పిల్లలకూ రక్షణ.. కరోనాపై పోరాటంలో మరో ముందడుగు

మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో మరో ముందడుగు పడింది. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, వైరస్‌ సోకినా స్వల్ప లక్షణాలతో బయటపడే అవకాశం ఉంటోంది. వ్యాక్సిన్‌ భారీగా వేయడం ద్వారానే కరోనా మూడో వేవ్‌ను భారత దేశం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం 12–14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఏపీలో తొలిరోజు 4,767 మందికి వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ ఇచ్చింది. పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌లో భారత్‌ ప్రపంచంలో ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. వయస్సు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా దేశంలో వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. మొదట కోవిడ్‌ వారియర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు, 60 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి, ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు టీకా అందించారు. వ్యాక్సిన్‌ సరఫరాకు అనుగుణంగా విడతల వారీగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు విడతల డోసులు పూర్తయిన తర్వాత 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించారు.

దేశంలో దాదాపు 18 ఏళ్లు పైబడిన వారికి రెండు డోసులు టీకా అందించారు. ఏపీలో వందశాతం పూర్తయింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చిన తర్వాత.. 15–17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు రెండు డోసుల టీకా అందించారు. ఈ క్రమంలోనే తాజాగా 12–14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కరోనా థర్డ్‌ వేవ్‌ సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుందనే హెచ్చరికలతో బూస్టర్‌ డోసును కూడా పంపిణీ చేశారు. రెండు డోసులు తీసుకుని 90 రోజులు పూర్తయిన వారికి బూస్టర్‌ డోసు వేశారు.

థర్డ్‌ వేవ్‌లో చిన్నారులపై వైరస్‌ ప్రభావం చూపుతుందనే హెచ్చరికలు ఉన్నా.. ఆ ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా చిన్న పిల్లలకు టీకా ఇవ్వడం ఉత్తమమనే భావనలో ప్రభుత్వాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం తగ్గినా.. ప్రమాదం ఇంకా తొలిగిపోలేదు. నాలుగో వేవ్‌ రాదన్న నమ్మకం లేదు. కొత్త వేరియట్‌ పుడితే నాలుగో వేవ్‌ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. చైనా, హాంకాంగ్‌ దేశాల్లో కొత్త వేరింట్‌ పుట్టింది. ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ స్టెల్త్‌ ఒమిక్రాన్‌ హాంకాంగ్, చైనా దేశాలను వణికిస్తోంది. లాక్‌డౌన్‌లతో వైరస్‌ను అరికట్టేందుకు చైనా, హాంకాంగ్‌ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు టీకా తీసుకోవడం ద్వారా సన్నద్ధం అవచ్చు.

Show comments