iDreamPost
iDreamPost
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు 50 వేలు క్రాస్ చేశాయి. గత 24 గంటల్లో దేశంలో 58,097 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,14,004 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా తాజాగా 534 మంది కరోనా మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 4,82,551 కి చేరింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,389 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రికవరీల సంఖ్య 3,43,21,803 కు చేరింది. ఇప్పటి వరకు 147.72 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక మన దేశంలో రోజు వారి పాజిటివిటీ రేటు 4.18% కు చేరింది. ఇదిలా ఉంటే ఉన్నది చాలదు అన్నట్టు “ఓమిక్రాన్” కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి.
భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే కుటుంబ సభ్యులు ఎవరికివారు ఇంట్లోనే పరీక్ష చేసుకునేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తెలంగాణలో సైతం కరోనా కేసులు విపరీతంగా పెరగటంతో పాటుగా.. ఒమిక్రాన్ కేసులు సైతం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పరీక్షకు సంబంధించిన కిట్లను అందుబాటులో ఉండే మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు కూడా అనుమతించాలని నిర్ణయించారు. అయితే ఏ విధంగా కరోనా పరీక్ష చేసుకోవాలి..? నిర్ధారణ ఎలా అవుతుందనే అంశాలు పరీక్ష కిట్ లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కిట్ ఎంత ధరలో విక్రయిస్తారనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.
అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో ఇంట్లోనే పరీక్షలు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో కరోనా పరీక్ష చేసుకున్నవారికి ఒకవేళ పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రికి తెలియజేస్తే, వారికి అనుగుణంగా హోం ఐసోలేషన్ కిట్లను పంపిస్తారు. ఈ మేరకు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారని సమాచారం. ఒకవేళ కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనాలతో పాటుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరికి వారు తమ ఇంట్లోనే పరీక్షలు చేసుకొని నిర్దారించుకుంటే..పాజిటివ్ వచ్చిన వారిలో ఎంతమంది బయటకు చెబుతారు..? ఆ వివరాలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందనే సందేహం నెలకొంది.
దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ మొదలైన సమయంలో ఇలాంటి కీలక నిర్ణయం ఒక విధంగా మంచిదే… అయినా..ఎవరి ప్రాణాలకి వాళ్ళే రక్షణ కల్పించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు అనుకుంటే పొరపాటే. ఈ కరోనా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటుకి బలవ్వటం ఖాయంగా కనిపిస్తుంది. కరోనా విపరీతాలు ఎంత భయంకరంగా ఉంటాయో గతంలో మొదటి రెండు వేవ్స్ లో చూశాము. అందుకే ప్రజలందరూ మాస్క్, శానిటైజర్ ని నిత్యకృత్యంగా అలవాటు చేసుకోవాలి . మరియు ప్రభుత్వం నిబంధలను తప్పకుండా పాటించాలి లేకపోతే మిమ్మల్ని కరోనా కాటు వేయటం తథ్యం.
Also Read : హామీ ఇవ్వలేదు.. ప్రజలు కోరుకున్నారు.. జగన్ చేస్తున్నారంతే..