iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా గత నెల 30న జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయానికి చాలావరకు ఫలితాలు వెల్లడయ్యాయి. మరికొన్నింటిలో ఆధిక్యతలు స్పష్టమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమి 15 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో బీజేపీకి 6 లభించగా, మిత్రపక్షాలు 9 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ 4 సీట్లలో విజయం సాధించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి స్వీప్ చేసింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇక ఎన్నికలు జరిగిన మూడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, శివసేన ఆధిక్యంలో ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా అసెంబ్లీ ఫలితాలు..
-మధ్యప్రదేశ్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పృథ్వి పూర్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ శిశుపాల్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నితేంద్రసింగ్ రాథోడ్ పై 7307 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జోబాట్ లో బీజేపీ అభ్యర్థి సులోచన రావత్ కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ రావత్ పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాయ్ గాంలో కాంగ్రెస్ అభ్యర్థి కల్పన వర్మ బీజేపీ అభ్యర్థి ప్రతిమ భాగ్రీ పై ఆధిక్యంలో ఉన్నారు.
-బీహార్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా కుశ్వేశ్వర్ ఆస్థాన్ ను అధికార జేడీయూ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి సమం భూషణ్ హజారీ ఆర్జేడీ అభ్యర్థి గిరీష్ భర్తీపై 12వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. తారాపూర్ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి అరుణకుమార్ 2700 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు.
-హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీకి దెబ్బ తగిలింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు నియోజకవర్గాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జుబ్బాల్ కోట్కాయ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థి నీలం షైరిక్ పై 6293 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఫతేపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి భవానీ సింగ్ ఫతానియా విజయం సాధించగా.. ఆర్కీలో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది.
-పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. మొత్తం నాలుగు స్థానాల్లోనూ విజయం సాధించింది. దిన్హాతలో ఆ పార్టీ అభ్యర్థి ఉదయన్ గుహ 1.63 లక్షల భారీ ఆధిక్యంతో అశోక్ మండల్(బీజేపీ)పై గెలిచారు. మిగిలిన శాంతిపూర్‌లో బ్రిజ్ కిషోర్ గోస్వామి, కర్దాహలో సోమన్ దేవ్ చటర్జీ, గోసభలో సుబ్రతో మండల్ తమ సమీప బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించారు.
-మేఘాలయాలో మూడు చోట్ల ఎన్నికలు జరగ్గా అధికార కూటమికి చెందిన ఎన్ పీపీ, యూడీపీలు విజయం సాధించాయి. రాజబల నియోజకవర్గంలో అబ్దుస్ సలేహ్(ఎన్ పీపీ) మూడువేల మెజారిటీతో గెలిచారు. మౌరేంజికెన్గ్ లో
ఎన్ పీపీ అభ్యర్థి పినైడ్ సీయోమ్, మౌఫ్లాంగ్ లో యూడీపీ అభ్యర్థి మాజీ ఫూట్ బాల్ క్రీడాకారుడు యూజన్సన్ లింగ్డో గెలిచారు.
-అసోంలో ఎన్నికలు జరిగిన 5 స్థానాలు ఎన్డీయే కూటమి ఖాతాలో చేరాయి. టౌవ్రాలో బీజేపీ అభ్యర్థి సుశాంత బోరగోయిన్ 30561 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిపై నెగ్గారు. మరియాని స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రూప్ జ్యోతి కుర్మీ ఆధిక్యంలో ఉన్నారు. బాబనిపూర్లో కూడా బీజేపీ అభ్యర్థి ఫణీదార్ తాలుక్ దార్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. తముల్ పూర్లో యూపీపీఎల్ అభ్యర్థి జోవిన్ డైమరి 50 వేళా మెజారిటీతో విజయం సాధించారు.
-కర్ణాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హనగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మనే 6828 ఓట్ల ఆధిక్యతలో ఉండగా
సిందిగిలో బీజేపీ అభ్యర్థి రమేష్ భూసనూరు సుమారు 31500 మెజారిటీతో గెలిచారు.
-రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగిన రెండు స్థానాలనూ అధికార కాంగ్రెస్ నిలబెట్టుకుంది.దరియవాద్లో నాగరాజ్ మీనా విజయం సాధించారు. వల్లభనగర్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియా షిక్తావత్ ఆర్ఎల్డీ అభ్యర్థి ఉదమ్ లాల్ దంగిపై 20 వేల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది.
-హర్యానాలో ఎన్నిక జరిగిన ఎల్లేనాబాద్ లో ఐఎన్ఎల్డీ అభ్యర్థి అభయ్ చౌతాలా 8180 ఓట్ల ఆధిక్యతలో విజయానికి చేరువలో ఉన్నారు.
-మహారాష్ట్రలోని దేగ్లుర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జితేష్ అంతపూర్కర్ బీజేపీ అభ్యర్థి సబ్నే సుభాష్ పిరాజిరావుపై 23878 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
-మిజోరంలోని టూరియల్ నియోజకవర్గంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది.
-నాగాలాండ్‌లో శమాటర్ చేసోర్ స్థానంలో అధికార ఎండీపీపీ విజయం సాధించింది.
-తెలంగాణలోని హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6వేల పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు.
-ఏపీలోని బద్వేలు నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించించారు.
ఎంపీ ఫలితాలు
దేశంలో మూడు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ, కాంగ్రెస్, శివసేన చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హావేలీలో శివసేన 15వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ 6006 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా నియోజకవర్గంలో బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.