iDreamPost
android-app
ios-app

పెద్దల సభ గౌరవం సభ్యుల చేతిలోనే ఉంది

  • Published Jan 22, 2020 | 4:48 AM Updated Updated Jan 22, 2020 | 4:48 AM
పెద్దల సభ గౌరవం సభ్యుల చేతిలోనే ఉంది

శాసన మండలితో ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. వారి ఎన్నిక అన్నివర్గాల ప్రజలకు సంబంధించింది కాదు. అక్కడి సభ్యుల ఎన్నిక ఎలా జరుగుతుందో కూడా అధికశాతం ప్రజలకు అవగాహన లేదు. “పెద్దల సభ” అనే గౌరవం ఉంటుంది.

ప్రజలతో ఈ సభ సభ్యులకు నేరుగా సంబంధాలు ఉండాల్సిన పని లేదు. అధికారంలో ఉన్న పార్టీ అవకాశాన్ని బట్టి అక్కడ సభ్యుల ఎన్నిక ఉంటుంది. ఆ సభ నిర్ణయాన్ని ప్రజా నిర్ణయంగా చూడలేం. అక్కడి గెలుపు ఓటములు ప్రజాతీర్పును ప్రతిబింభిచజాలవు. గెలుపు ఓటములు, ప్రజా తీర్పు ప్రతిభింబించేది కేవలం శాసన సభ మాత్రమే. శాసన మండలిలో గెలుపు ఓటములు ప్రభుత్వ పనితీరుపై ప్రజా తీర్పుగా చూడలేం. ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ సభ ప్రతిభింబించలేదు. ప్రజలు ఇచ్చిన బలం శాసనసభలో ఉంటుంది. ఆ బలమే ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిభింబిస్తుంది.  ప్రభుత్వం ఇచ్చే బలం, ప్రభుత్వం ద్వారా వచ్చే బలం మాత్రమే శాసన మండలిలో కనిపిస్తుంది.

ఈ సభ రబ్బరు స్టాంపు కాదు. విచక్షణ, విజ్ఞత, ప్రావీణ్యం కలిగిన సభ్యులుండే సభ. శాసన సభలో చేసే నిర్ణయాలను చర్చించ వచ్చు. తప్పొప్పుల సూచనలు చేయవచ్చు. పునఃపరిశీలనకు పంపవచ్చు. అంతే కానీ చర్చకు అంగీకరించకపోవడం, లేదా తిరస్కరించడం సమర్ధనీయం కాదు.

నిన్నటివరకూ టిడిపి అధికారంలో ఉందికాబట్టి ఆ పార్టీ బలమే ఈ సభలో కనిపిస్తుంది. వైసీపీ బలం కనిపించాలంటే ఇంకో రెండేళ్ళు వేచి చూడాల్సి వస్తుంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటికి కాంగ్రెస్ పార్టీకే సభలో ఆధిక్యం ఉంది. అప్పటి సభకు చైర్మన్ కూడా కాంగ్రెస్ సభ్యుడే. అయినా, అప్పట్లో ఈ సభ శాసనసభ ద్వారా వచ్చే టిడిపి ప్రభుత్వ నిర్ణయాలను (బిల్లులను), వ్యతిరేకించలేదు.

టిడిపి ప్రభుత్వం జూన్ 8, 2014లో అధికారంలోకి వచ్చినప్పటికీ నవంబర్ 15, 2017 వరకూ శాసన మండలి కాంగ్రెస్ ఆధిపత్యంలోనే ఉంది. ఈ సమయంలో టిడిపి ప్రభుత్వం తీసుకున్న అనేక కీలకమైన నిర్ణయాలు కాంగ్రెస్ చైర్మన్ (డాక్టర్ A.చక్రపాణి) నేతృత్వంలోని శాసన మండలి ఆమోదించింది. శాసన సభను అమరావతికి తరలించడం,

సిఆర్డీఏ చట్టం వంటి కీలక నిర్ణయాలను ఈ సభ ఆమోదించింది. పెద్దల సభ ఇలా ప్రజాతీర్పును గౌరవించి సానుకూలంగా స్పందించాలి తప్ప రాజకీయంగా స్పందిస్తే సభ తన గౌరవాన్ని కాపాడుకోలేదు. అనేకమంది విశ్లేషకులు చెప్పినట్టు పెద్దల సభ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రం కాకూడదు. ఆ సభ గౌరవం కాపాడుకునే నిర్ణయం ఆ సభలోని సభ్యుల చేతిలోనే ఉంది.